బీజింగ్: చైనాలోని ఓ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులపై కత్తులతో విరుచుకుపడి రక్తపాతం సష్టించిన ముగ్గురు నరహంతకులకు అక్కడి ఓ కోర్టు శుక్రవారం మరణశిక్ష ప్రకటించింది. ఇదే కేసులో మరో నిందితురాలికి జీవిత ఖైదును ఖరారు చేసింది. ఈ ఏడాది మార్చి 1న జింజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని కున్‌మింగ్ పట్టణ రైల్వే స్టేషన్‌లోకి కొందరు దుండగులు కత్తులతో చొరబడి కనిపించిన వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆనాటి దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, 141 మందికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలంలోనే నలుగురు నిందితులను హతమార్చగా... మరో నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్నారు.
అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం కున్‌మింగ్ ప్రజా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరికి అల్‌ఖైదా మద్దతు ఉందని నివేదించారు. విచారణ అనంతరం నిందితులు ఇస్కంద్ ఎహెట్, తుర్గున్ తోహ్తుయాంజ్, హసిన్ మొహమ్మద్‌కు మరణశిక్షను విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువడింది.