కన్యత్వానికి రూ.3.5 లక్షల ఖరీదు
బూటకపు వాగ్దానాలతో తన కన్యత్వాన్ని దోచుకున్న ప్రియుడిపై ఓ చైనా మహిళ దావా వేసింది. తన కన్యత్వ హక్కుకు భంగం కలిగించాడంటూ కోర్టుకు ఎక్కింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆమెకు 5 వేల డాలర్ల(సుమారు రూ.3.5 లక్షలు) పరిహారం ఇప్పించిందని షాంఘై మీడియా పేర్కొంది.
లీ అనే వ్యక్తి తన వివాహ విషయాన్ని దాచిపెట్టి షిన్ అనే మహిళతో డేటింగ్ చేశాడు. షిన్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వస్వాన్ని దోచుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. తనను మానసికంగా, ఆరోగ్యపరంగా కుంగదీసినందుకు లీ నుంచి 81 వేల డాలర్లు పరిహారం ఇప్పించాలని షిన్ దావా వేసింది.
మగువ మానాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందంటూ కోర్టు ఆమెకు 5 వేల డాలర్ల పరిహారం ఇప్పించింది. ఆమె డిమాండ్ చేసిన మొత్తం చాలా ఎక్కువని న్యాయస్థానం అభిప్రాయపడింది. శీలాపహరణ స్త్రీ ఆరోగ్యాన్ని, స్వేచ్ఛను, ప్రతిష్టను దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది.