ఆన్‌లైన్ గేమింగ్‌లో 14 రోజులు...
చైనాకు చెందిన మిస్టర్ జియా ఒకటి, రెండు రోజులు కాదు, ఏకంగా 14 రోజుల పాటు తిండీ తిప్పలు లేకుండా ఓ పక్క ఆన్‌లైన్ గేమ్ మారథాన్ ఆడుతూ మరోపక్క పెట్టెమీద పెట్టె సిగరెట్లు కాలుస్తూ చివరకు కుప్పకూలిపోయాడు. అన్‌హుయీ రాష్ట్రంలోని ఓ ఇంటర్నెట్ కేఫ్‌లోకి సరిగ్గా 15 రోజుల ముందు వెళ్లాడు. అప్పటినుంచి నిద్రహారాలు లేకుండా ఆన్‌లైన్ వీడియోగేమ్ ఆడుతూనే ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున నీరసంతో కింద పడిపోయాడు.
హుటాహుటిన అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. కానీ కంప్యూటర్‌లో గేమ్ ఆడడం కోసం అతడు చేస్తున్న అల్లరిని డాక్టర్లు భరించలేక పోతున్నారు. నిద్రపోయేందుకు మందులిచ్చినా పెద్దగా ఫలితం లేదట. ప్రపంచంలోకెల్లా చైనాలోని యువకుల్లో ఆనలైన్ వీడీయో గేమ్‌ల పిచ్చి విపరీతంగా పెరిగిపోతోంది. దాదాపు రెండున్నర కోట్ల మంది యువకులు దీనికి బానిసలైనట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. వీటి నుంచి యువకులు, పిల్లలను బయట పడేసేందుకు దేశవ్యాప్తంగా 250 బూట్ క్యాంపులను చైనా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిలో సైనిక తరహా క్రమశిక్షణ నేర్పుతారు. అయినా ఆశించినంత ప్రయోజనం లేకపోవడంతో ప్రతి గేమ్‌కు కాల పరిమితిని విధించాలని చైనా ప్రభుత్వం గేమ్ డిజైనింగ్ కంపెనీలను వేడుకుంటోంది.