
రోడ్డుపై దిగిన హెలికాప్టర్
ఇటానగర్: 19 మంది ప్రయాణికులు... ఐదుగురు సిబ్బందితో పవన్ హన్స్ హెలికాప్టర్ నహర్లగన్ నుంచి గౌహతి బయలుదేరింది. అరగంట ప్రయాణించిన తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. హెలికాప్టర్ ముందుకు వెళ్లలేని పరిస్థితి దాంతో ఇదే విషయాన్ని హెలికాప్టర్ పైలెట్... తేజ్పూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కి తెలియజేశాడు. హెలికాప్టర్ వెనక్కి వెళ్లేందుకు కూడా వాతావరణం అనుకూలించడం లేదని అతడు ఏటీసీ అధికారులకు వెల్లడించాడు.
దీంతో హెలికాప్టర్ కిందకి దింపేందుకు ఆదేశాలు ఇవ్వాలని వారిని కోరాడు. వెంటనే అప్రమత్తమైన ఏటీసీ అధికారులు పౌర విమానయాన ఉన్నతాధికారులతో సంప్రదించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించడంతో సోనిత్పూర్ జిల్లా గోపూర్ బలిజన్ రహదారిపై హెలికాప్టర్ను దింపేశారు. హెలికాప్టర్లోని 19 మంది ప్రయాణికులు... ఐదుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.