పాకిస్థాన్‌లో క్రైస్తవ మహిళపై దారుణం
లాహోర్: పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవ మహిళ పట్ల దారుణం జరిగింది. ఆమె సోదరుడు ఓ ముస్లిం వివాహిత స్త్రీతో పారిపోవడంతో సదరు మహిళ బంధువులు ఆమెపై దాడి చేశారు. నలుగురు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి దుస్తులు ఊడదీసి.. ఆమె అత్యాచారం చేయబోయారు. ఆ దుండగుల నుంచి అతి కష్టం మీదుగా తప్పించుకున్న బాధితురాలు పొరుగింట్లోకి వెళ్లి తలదాచుకుంది. లాహోర్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే హజి పార్క్ తాజ్‌పుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
బాధితురాలా సమ్రా సోదరుడు బాదల్ ఇటీవల ఓ ముస్లిం వివాహిత మహిళతో ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆమె భర్త, మరో ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి సమ్రా ఇంటిపై దాడి చేశాడు. ఆమె ఇంట్లోకి చొరబడి నీ తమ్ముడు బాదల్ ఎక్కడున్నాడో చెప్పాలని అడిగాడు. తెలియదని ఆమె చెప్పడంతో ఆమెపై దాడిచేసి.. బట్టలూడదీసి సామూహిక అత్యాచారయత్నం చేయబోయారు. దీంతో ఆమె వారి బారినుంచి తప్పించుకొని పక్కవాళ్ల ఇంట్లో తలదాచుకుంది. నగ్నంగా ఉన్న తనకు పొరుగింటి వారు దుస్తులు ఇచ్చారని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ ఘటనలో నిందితుడు వసీఫ్ నసీర్ పై పోలీసులు కేసు పెట్టారు. అయితే, తాను ఫిర్యాదు చేసినా నిందితుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అతను యథేచ్ఛగా తిరుగుతూ తమను బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.