నీళ్ల సాక్షిగా నిజాలకు పాతర | CM chandrababu lies on Paidipalem | Sakshi
Sakshi News home page

నీళ్ల సాక్షిగా నిజాలకు పాతర

Published Thu, Jan 12 2017 1:28 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

నీళ్ల సాక్షిగా నిజాలకు పాతర - Sakshi

నీళ్ల సాక్షిగా నిజాలకు పాతర

‘పైడిపాలెం’ జాతికి అంకితం చేస్తూ సీఎం పచ్చి అబద్ధాలు
♦ అసాధ్యమనుకున్న ప్రాజెక్టును సుసాధ్యం చేశామని గొప్పలు
♦ 2019లో పోలవరం జాతికి అంకితం చేస్తాం..సీఎం తీరుపై విస్తుపోయిన రైతులు
♦ దివంగత వైఎస్‌ హయాంలో దాదాపు పూర్తి అయిన ప్రాజెక్టులను బాబు ప్రారంభిస్తున్నారని మండిపాటు

సాక్షి ప్రతినిధి, కడప: అసాధ్యమనుకున్న ప్రాజెక్టును పూర్తి చేసి చరిత్ర తిరగరాశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని గండికోట ఎత్తిపోతల పథకాన్ని రిమోట్‌ ద్యారా ప్రారంభించి, పైడిపాలెం రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం జన్మభూమి–మా ఊరు గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను పూర్తి చేయడమే తన లక్ష్యం అన్నారు. గండికోట ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన ఈ రోజు తన జీవితంలో గుర్తుండిపోతుందన్నారు. పులివెందుల నియోజకవర్గానికి నీళ్లివ్వడం తనకు సంతోషంగా ఉందన్నారు.

సోమవారం నా డైరీలో పోలవరం డేగా మార్చుకున్నానని, ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నామన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు ప్రణాళిక చేపట్టామని, 2019లో జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు నీళ్ల సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడటంపై రైతులు విస్తుపోయారు. ప్రతిపక్ష నేతపై తీవ్ర విమర్శలు చేయిస్తూ, ఎంపీ అవినాశ్‌ రెడ్డి మాట్లాడుతుంటే అడ్డంకులు సృష్టిస్తూ అంతా తన ఘనతేనని చాటుకోవడాన్ని చూసి ఔరా.. అనుకుంటూ జనం ముక్కున వేలేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు తుది మెరుగులు దిద్ది.. తానే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని వాపోయారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించామని, నాబార్డు ద్వారా రూ.1,981కోట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందజేసిందని సీఎం చంద్రబాబు చెప్పగానే.. విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, కమీషన్ల కోసం పట్టుబట్టి చేజిక్కించుకున్న విషయం చర్చనీయాంశమైంది. పట్టిసీమ పథకాన్ని 12 నెలల్లోగా పూర్తి చేసి గోదావరి– కృష్ణా నదులను అనుసంధానం చేశామని, దేశంలో ఇదే ప్రథమం అన్న చంద్రబాబు మాటలు విన్న అధికారులు.. 1868లోనే డచ్‌ దేశానికి చెందిన ప్రైవేట్‌ సంస్థ కేసీ కెనాల్‌ తవ్వి తుంగభద్ర– పెన్నా నదులను అనుసంధానం చేసిందని మాట్లాడుకోవడం వినిపించింది. కృష్ణానీటిని శ్రీశైలంలో నిల్వ చేసి రాయలసీమకు అందించగలిగామని ముఖ్యమంత్రి చెప్పడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

వైఎస్‌ హయాంలో దాదాపు పూర్తి అయిన కాలువలకు చిన్న చిన్న పెండింగ్‌ పనులు పూర్తి చేసి ఉంటే దాదాపు 26 టీఎంసీల నీరు గండికోటకు తరలించే అవకాశం ఉండిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అలా చేయకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కేవలం 4.8 టీఎంసీలను అతి కష్టంగా తీసుకొస్తూ గొప్పలు చెప్పకుంటున్నారని రైతులు మండిపడ్డారు. 2013లోనే ఇదే రీతిలో 3 టీఎంసీల నీటిని తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.   

జన్మభూమిలో ఏకపాత్రాభినయం
జన్మభూమి–మాఊరు కార్యక్రమం మొత్తం  చంద్రబాబు ఏకపాత్రాభినయాన్ని తలపించింది. ప్రజాస్వామ్యానికి తావులేదన్నట్లుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను విస్మరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి దోహదపడిన వ్యక్తులంటూ మంత్రి  ఉమామహేశ్వరరావు, ఇతర టీడీపీ నేతలతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయించి పొంగిపోయారు. అవకాశం దొరికిందే తడువుగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ ప్రసంగాలు సాగించారు. వారందరికీ వ్యాఖ్యాత తరహాలో వ్యవహరిస్తూ సీఎం ఆనంద పడటం చూసి సభకు హాజరైన జనం విస్తుపోయారు. ఇదే సమయంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ పేరు ప్రస్తావించగానే జనం నుంచి ఒక్కసారిగా ఈలలు, కేకలు వినిపించాయి.   జన్మభూమి–మాఊరు కార్యక్రమం ఆధ్యంతం టీడీపీ కార్యక్రమంలా నిర్వహించారు. టీడీపీ నేతలు వేదికను ఆక్రమిస్తే.. కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, జేసీ శ్వేత తేవతియా, ఆర్డీఓ వినాయకం లాంటి అధికారులంతా నిల్చోవాల్సి వచ్చింది.

ముచ్చుమర్రీ ఆయన ఘనతేనట!
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రాణనాడీ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా జీఎన్‌ఎస్‌ఎస్‌కు డ్రా చేసుకోవచ్చని, 834 అడుగుల స్థాయిలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు లిఫ్ట్‌ చేసు కోవచ్చని, 798 అడుగులున్నా ముచ్చ మర్రి నుంచి లిఫ్ట్‌ చేసుకునే అవకాశం ఉంద చెప్పుకొస్తూ.. ఇదంతా తన ఘన తే అని చాటుకున్నారు. వాస్తవ మేమి టంటే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఆగస్టు 31, 2007న దివంగత సీఎం వైఎస్‌ హయాంలో ప్రారంభమైంది. అప్పట్లోనే దాదాపు 90 శాతం పూర్తి అయింది. మిగతా 10 శాతం పనులను కూడా సక్రమంగా పూర్తి చేయకుండానే చంద్రబాబు జాతికి అంకితం చేస్తూ గొప్పలకుపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement