కాఫీతో దీర్ఘాయుష్షు
కాఫీ ఎక్కువగా తాగితే ఆయుష్షు పెరుగుతుందా, అన్ని రకాల వ్యాధుల నుంచి ప్రాణాలకు వచ్చే ముప్పు తగ్గుతుందా.. అంటే అవుననే అంటున్నారు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు. గుండె జబ్బులు మొదలుకుని కేన్సర్, మధుమేహం, శ్వాస, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రాణాలకొచ్చే ముప్పుకు కాఫీకి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. దాదాపు 2.15 లక్షల మందిపై జరిపిన అధ్యయనం ద్వారా తెలిసిందని వెరోనికా సెటీవాన్ తెలిపారు. ఇతరులతో పోల్చినప్పుడు రోజుకో కప్పు కాఫీ తాగే వారికి మరణం సంభవించే అవకాశం 12 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
రెండు మూడు కప్పులు తాగే వారి విషయంలో ఈ సంఖ్య 18 శాతమని చెప్పారు. సాధారణ, కెఫీన్ రహిత కాఫీల్లో దేన్ని తీసుకున్నా ప్రభావం మాత్రం ఒకేతీరున ఉందని చెప్పారు. కాఫీతో కొన్ని రకాల కేన్సర్లు, మధుమేహం, లివర్ సంబంధిత వ్యాధులను నివారించవచ్చని గతంలో ఒక అధ్యయనంలో తేలినప్పటికీ.. ప్రాణాలకు వచ్చే ముప్పు తగ్గుతుందని విశ్లేషించిన తొలి అధ్యయనం మాత్రం ఇదేనని సెటివాన్ తెలిపారు. ఈ అధ్యయనం నాలుగు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిపై జరిగిందని.. కాబట్టి ఇది ప్రజలందరికీ వర్తిస్తుందని చెప్పారు.