ఆగస్టులోనే జియో కమర్షియల్ లాంచ్
ముంబై : రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్స్ 4జీ సేవల కోసం ఇంకా ఒక్క నెల ఆగితే చాలట. ఆగస్టులో వీటిని కమర్షియల్ గా ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా తమ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబాలకే సిమ్ కార్డులు ఇచ్చిన కంపెనీ ఆగస్టులో వాణిజ్య కనెక్షన్లకు వెళ్లనుందని సమాచారం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం కంపెనీ, ఫ్రీడమ్ పేరుతో పిలుచుకునే తన తొలి జియో ప్రణాళిక కింద, డేటాతో కూడిన ఉచిత వాయిస్ సర్వీసులతో పాటు టాప్ ప్రత్యర్థుల కంటే 25శాతం తక్కువ ధరలను వినియోగదారులకు అందించాలని ప్రణాళికలు వేసేసింది. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టులోనే కమర్షియల్ గా జియో 4జీ సేవలను లాంచ్ చేయబోతుందని ఈ ప్లాన్ కు సంబంధించిన ముగ్గురు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 15నే వీటి లాంచింగ్ ఉంటుందని వెల్లడిస్తున్నారు.
జియో సేవల ప్లాన్ గురించి ముందుగానే కంపెనీ తన టీమ్ సభ్యులకు సమాచారం అందించింది. ఈ సేవలు డిసెంబర్ లో కమర్షియల్ గా వస్తాయని టీమ్ సభ్యులు భావించారు.ఆరేళ్ల శ్రమ అనంతరం ఈ 4జీ సేవలను రిలయెన్స్ కమర్షియల్ గా లాంచ్ చేయబోతోంది. 2010లో ప్యాన్ ఇండియా 4జీ ఎయిర్ వేవ్స్ ను కొనుగోలుతో కంపెనీ టెలికాం సెక్టార్ లోకి పునఃప్రవేశించింది.
ఉచిత వాయిస్ సర్వీసుల ఆఫర్ తో భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ వంటి పోటీ సంస్థలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన రిలయెన్స్ 4జీ జియో సర్వీసులపై దూకుడుగా వెళ్తోంది. జియో సేవల కింద ఉచిత వాయిస్ ప్లాన్ అందుబాటులో ఉండటంతో పాటు, రూ.80తో 1జీబీ డేటాను జియో సబ్ స్క్రైబర్లు వేపించుకోవాల్సి ఉంటుందని మరో అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆపరేటర్లు 1జీబీ డేటాను రూ.100-120లకు అందిస్తున్నాయి. తమ పోటీదారులకంటే 80శాతం రిలయెన్స్ జియో స్పీడుగా ఉంటుందని ముకేష్ అంబానీ చెప్పిన సంగతి తెలిసిందే. కమర్షియల్ లాంచింగ్ కోసం ముందుగానే తన లైఫ్ ఫోన్ల ధరలను కూడా తగ్గించేసింది.