commercial launch
-
మరో ‘వాణిజ్య సవాలు’కు... ఇస్రో సన్నద్ధం
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య ప్రయోగాల పరంపరలో మరో ముందడుగు. సింగపూర్‌కు చెందిన సమాచార ఉపగ్రహం సింథటిక్ అపర్చర్ రాడార్ (డీఎస్–ఎస్ఏఆర్)తో పాటు మరో 6 బుల్లి ఉపగ్రహాలను సంస్థ పీఎస్ఎల్వీ–సి56 ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. జూలై 30న ఉదయం శ్రీహరికోటలో మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి జరిగే ఈ ప్రయోగం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎస్ఏఆర్ను సింగపూర్ ప్రభుత్వ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సింగపూర్ టెక్నాలజీస్ సంయుక్తంగా ఇంజనీరింగ్ లిమిటెడ్ అభివృద్ధి చేశాయి. ఇది పూర్తి వాణిజ్య ప్రయోగమని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సోమవారం పేర్కొన్నారు. ► తొలుత జూలై 26న తలపెట్టిన ఈ ప్రయోగం 30కి వాయిదా పడింది. ► 360 కిలోల ఎస్ఏఆర్తో పాటు మొత్తం ఏడు ఉపగ్రహాలను భూమి నుంచి 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్ ఈక్విటోరియల్ ఆర్బిట్ (ఎన్ఈఓ–నియో) కక్ష్యలోకి పీఎస్ఎల్వీ–సి56 ప్రవేశపెట్టనుంది. ► మిగతా ఆరు ఉపగ్రహాలు వెలోక్స్–ఏఎం (23 కిలోలు), ఆర్కేడ్, స్కూబ్–2, న్యూలియోన్, గలాసియా–2, ఆర్బి–12 స్ట్రైడర్. -
గుడ్ న్యూస్ : త్వరలో స్పుత్నిక్-వీ కమర్షియల్ లాంచ్
సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ల కొరతపై అనేక విమర్శల కొనసాగుతున్న సమయంలో డాక్టర్ రెడ్డీస్ కీలక విషయాన్ని ప్రకటించింది. రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ కమర్షియల్ లాంచ్ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. రాబోయే వారాల్లో వాణిజ్యపరంగా ఇది అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ ఒక ప్రకటన విడదుల చేసింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రకక్రియ మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. కాగా 91.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని భావిస్తున్న స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను మే 14న సాఫ్ట్ పైలట్ ప్రాతిపదికన డాక్టర్ రెడ్డీస్ భారతదేశంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్టు, డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో స్థానికంగా ఉత్పత్తి చేసిన దిగుమతి చేసుకున్న 100 మిలియన్ల స్పుత్నిక్ -వీ డోస్‌లను అందించాలని భారత ప్రభుత్వం ఆశిస్తోంది. -
గుడ్ న్యూస్: 2 డీజీ సాచెట్ కమర్షియల్ లాంచ్
సాక్షి, ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ ప్రజలను భయపెడుతోంది. ఈ క్రమంలో దేశీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా చికిత్సలో ప్రభావవంతగా పనిచేస్తున్న, డీఆర్డీవో, రెడ్డీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) డ్రగ్ ఇక మార్కెట్లో లభ్యం కానుంది. సోమవారం 2డీజీ ఔషధాన్ని కమర్షియల్‌గా లాంచ్ చేసింది. దేశంలోని ప్రధాన ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ ఉత్పత్తిని సరఫరా చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 99.5 శాతం సమర్ధత కలిగిన ఈ 2డీజీ సాచెట్ 990 రూపాయల వద్ద ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేటుతో అందించనుంది. మొదట్లో తమ ఉత్పత్తి 2డీజీ ఔషధం మెట్రో, టైర్-1 నగరాల్లోని ఆసుపత్రులలో అందుబాటులో ఉంటుందనీ, ఆతరువాత భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని అని కంపెనీ ఒక ప్రకటన తెలిపింది. దీంతో రెడ్డీస్ ఉదయం సెషన్లో షేర్ ధర ఒక శాతం ఎగిసింది. డాక్టర్ రెడ్డీస్ సహకారంతో డీఆర్డీవో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ భాగస్వామ్యంతో ఈ 2 డీజీ డ్రగ్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన సాధారణ నుంచి తీవ్ర లక్షణాలున్న కరోనా రోగులకు అనుబంధ చికిత్సగా దీన్ని ఉపయోగిస్తున్నారు. చదవండి : కోవిషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో భరోసా -
జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ లాంచింగ్ రేపే: రిజిస్ట్రేషన్ ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను రేపు (గురువారం, సెప్టెంబరు 5) ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయనుంది. రిలయన్స్ జియో జిగాఫైబర్ పేరుతో ఈ సేవలను దేశవ్యాప్తంగా తీసుకురానుంది. ఈ మేరకు జియో వెబ్సైట్ ద్వారా ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. జియో ఫైబర్ సేవల కోసం జియో వెబ్ సైట్లో అడ్రస్ తెలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. దేశంలోని 1600 పట్టణాల నుంచి 15 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్టు సమాచారం. జియో ఫైబర్ ప్లాన్స్ విషయానికి వస్తే.. ప్రీమియం వినియోగదారులకు ప్లాన్లు నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు ఉండనున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని జియో ఇటీవల తెలిపింది. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు ఫుల్ హెచ్డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా జియో అందించనుంది. అంతేకాదు జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు కొత్త సినిమాలను థియేటర్ కు వెళ్లకుండానే, ఇంట్లో కూర్చొని వీక్షించవచ్చు. అయితే, ఈ సర్వీస్ 2020 మధ్యనాటికి అందుబాటులోకి రానుంది. జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి రిలయన్స్ జియో ఫైబర్ లింక్‌కు వెళ్లండి. జియో ఫైబర్ కనెక్షన్‌ను యాక్సెస్ చేయదలిచిన చోట మీ చిరునామాను (ఇల్లు లేదా కార్యాలయం) పేర్కొనాలి. అనంతరం తరువాతి పేజీలో పేరు, మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ ముగిసాక, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని సంబంధిత బాక్స్‌లో ఎంటర్ చేయాలి. ఓటీపీ నిర్ధారించబడిన తర్వాత, జియో సేల్స్ ప్రతినిధికి జియో ఫైబర్ కనెక్షన్ పొందడానికి అవసరమైన పత్రాన్ని (ఆధార్ కార్డు, ఓటరు ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లలో ఏదో ఒకదాన్ని) అందచేస్తే సరిపోతుంది. ఇటీవల 42వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ వాణిజ్య సేవలను సెప్టెంబర్ 5న ప్రారంభించనున్నామని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి : ముకేశ్.. మెగా డీల్స్! జియో ఫైబర్ సంచలనం : బంపర్ ఆఫర్లు -
మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. టెలికాం చరిత్రలో జియో ఎంట్రీతోడేటా విప్లవానికి నాంది పలికిన సంస్థ ‘జియో గిగా ఫైబర్’ పేరుతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సేవల ఆవిష్కారానికి రంగం సిద్ధం చేసింది. హై-స్పీడ్ ఫైబర్-టు-హోమ్ (ఎఫ్టిటిహెచ్) జియో గిగా ఫైబర్ ఆగస్టు 12న కమర్షియల్‌గా లాంచ్ చేయనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సందర్భంగా అధికారికంగా ఈ సేవలను ప్రారంభించనుందని అంచనా. జియో గిగా ఫైబర్‌తో భారత దేశంలోని బ్రాండ్‌బాండ్‌తో పాటు డీటీహెచ్ టీవీ రంగంలో(బీటా ట్రయల్స్) ఇప్పటికే జియో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రత్యేక ఆఫర్లతో భారతదేశంలో1100 నగరాల్లో జియో గిగా ఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను సంస్థ ప్రారంభించినప్పటికీ కమర్షియల్‌గా ఇంకా లాంచ్ కాలేదు. ప్రధానంగా ఇటీవల డీటీహెచ్ బాదుడు షురూ అయిన నేపథ్యంలో జియో గిగా ఫైబర్ లాంచింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది తీపి కబురే. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో భారీ లాభాలను నమోదు చేసింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ జియో గిగా ఫైబర్ సేవల బీటా ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. లాంచింగ్ వివరాలను స్పష్టంగా పేర్కొనక పోయినప్పటికీ, జియోగిగా ఫైబర్ సేవల బీటా ట్రయల్స్ చాలా విజయవంతమయ్యాయి, 50 మిలియన్లకు పైగా వినియోగదారులే లక్ష్యంగా త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామని ప్రకటించడం గమనార్హం. జియో గిగా ఫైబర్ మొదట సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీగా రూ. 4,500గా ఉంది. అనంతరం ఇటీవల తన ఆప్టికల్ నెట్వర్క్ టెర్మినల్ (ఒఎన్‌టి) ద్వారా కేవలం రూ.2500 సెక్యూరిటీ డిపాజిట్‌తో బ్రాడ్‌బాండ్ సేవలు, వాయిస్ కాల్స్, ఓపీటీవీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం 600 రూపాయల కాంబో ప్లాన్‌తోపాటు, గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, జియో హోమ్ టీవీ, జియోటీవీలను ఒకే నెలవారీ ప్యాకేజీ కిందకి తీసుకువచ్చేలా తన ఉద్యోగులతో ట్రిపుల్ ప్లే ప్లాన్‌ను పరీక్షిస్తోంది. జియో డేటా సేవల మాదిరిగానే ఇది కూడా సునామీ సృష్టించనుందా? ఎలాంటి టారిఫ్‌లను అమలు చేయనుంది, ఎలాంటి ప్లాన్లను తీసుకురానుందని అనేదానిపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. -
జియో ఎఫెక్ట్: ఉచిత ఆఫర్లకు ఇక గుడ్ బై
ముంబై : ఉచిత సేవలతో ఇటు టెలికాం దిగ్గజాలకు షాకిలమీద షాకిలిచ్చిన రిలయన్స్ జియోతో టెలికాం రెగ్యులేటరి ట్రాయ్‌కు కొత్త తలనొప్పులు వచ్చాయి. రిలయన్స్ జియో ఉచిత సేవల ఆఫర్లపై గుర్రుగా ఉన్న ఇతర టెలికాం సంస్థలు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ దగ్గర కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు నమోదుచేశాయి. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ట్రాయ్, ఇక నిబంధనలనే కఠినతరం చేయాలని యోచిస్తోంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చే టెలికాం ఆపరేటర్ల కోసం కఠినతరమైన నిబంధనలు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. మే వరకు కొత్త నిబంధనలకు సంబంధించి సంప్రదింపుల ప్రక్రియ చేపట్టాలని ట్రాయ్ యోచిస్తోంది. కొత్త ఆపరేటర్లు తమ సిగ్నల్ ను పరీరక్షించే సమయంలో ఆ ఆపరేటర్ కు గరిష్టంగా ఎంతమంది సబ్ స్క్రైబర్లు ఉండాలని, ఎంతకాలం పరీక్షించాలని అనే వాటిపై నిబంధనలు ట్రాయ్ రూపొందిస్తోందని తెలుస్తోంది. ఈ సేవలను కూడా ఉచితంగా ఇవ్వాలా వద్దా అన్నదానిపై కూడా ట్రాయ్ నిర్ణయించనుందట. ఈ విషయంపై మే లోపు ఓ కన్సాలిడేషన్ పేపర్ ను కూడా ట్రాయ్ జారీచేయనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉచిత ఆఫర్లకు గండిపడనుందని తెలుస్తోంది. గతేడాది టెలికాం సెక్టార్ లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో, ఉచిత ఆఫర్లతో తమ కస్టమర్లను తన్నుకుపోయిందనే ఆరోపణలను సెల్యులార్ ఆపరేటర్స్ బాడీ కోయ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జియో సైతం భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ లు తమకు అవసరమైన మేర ఇంటర్ కనెక్షన్ పోర్ట్స్ ఇవ్వడం లేదని ఆరోపించింది. గతేడాది సెప్టెంబర్ లో జియో తన కమర్షియల్ సర్వీసులను తీసుకొచ్చింది. అప్పటి నుంచి మార్చి చివరి వరకు ఉచిత ఆఫర్లు అందించి, ఏప్రిల్ నుంచి టారిఫ్ ప్లాన్స్ ను అమలుచేస్తోంది. ఈ టారిఫ్ ప్లాన్స్ లోనూ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. -
ఆగస్టులోనే జియో కమర్షియల్ లాంచ్
ముంబై : రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్స్ 4జీ సేవల కోసం ఇంకా ఒక్క నెల ఆగితే చాలట. ఆగస్టులో వీటిని కమర్షియల్ గా ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా తమ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబాలకే సిమ్ కార్డులు ఇచ్చిన కంపెనీ ఆగస్టులో వాణిజ్య కనెక్షన్లకు వెళ్లనుందని సమాచారం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన టెలికాం కంపెనీ, ఫ్రీడమ్ పేరుతో పిలుచుకునే తన తొలి జియో ప్రణాళిక కింద, డేటాతో కూడిన ఉచిత వాయిస్ సర్వీసులతో పాటు టాప్ ప్రత్యర్థుల కంటే 25శాతం తక్కువ ధరలను వినియోగదారులకు అందించాలని ప్రణాళికలు వేసేసింది. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టులోనే కమర్షియల్ గా జియో 4జీ సేవలను లాంచ్ చేయబోతుందని ఈ ప్లాన్ కు సంబంధించిన ముగ్గురు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 15నే వీటి లాంచింగ్ ఉంటుందని వెల్లడిస్తున్నారు. జియో సేవల ప్లాన్ గురించి ముందుగానే కంపెనీ తన టీమ్ సభ్యులకు సమాచారం అందించింది. ఈ సేవలు డిసెంబర్ లో కమర్షియల్ గా వస్తాయని టీమ్ సభ్యులు భావించారు.ఆరేళ్ల శ్రమ అనంతరం ఈ 4జీ సేవలను రిలయెన్స్ కమర్షియల్ గా లాంచ్ చేయబోతోంది. 2010లో ప్యాన్ ఇండియా 4జీ ఎయిర్ వేవ్స్ ను కొనుగోలుతో కంపెనీ టెలికాం సెక్టార్ లోకి పునఃప్రవేశించింది. ఉచిత వాయిస్ సర్వీసుల ఆఫర్ తో భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ వంటి పోటీ సంస్థలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన రిలయెన్స్ 4జీ జియో సర్వీసులపై దూకుడుగా వెళ్తోంది. జియో సేవల కింద ఉచిత వాయిస్ ప్లాన్ అందుబాటులో ఉండటంతో పాటు, రూ.80తో 1జీబీ డేటాను జియో సబ్ స్క్రైబర్లు వేపించుకోవాల్సి ఉంటుందని మరో అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆపరేటర్లు 1జీబీ డేటాను రూ.100-120లకు అందిస్తున్నాయి. తమ పోటీదారులకంటే 80శాతం రిలయెన్స్ జియో స్పీడుగా ఉంటుందని ముకేష్ అంబానీ చెప్పిన సంగతి తెలిసిందే. కమర్షియల్ లాంచింగ్ కోసం ముందుగానే తన లైఫ్ ఫోన్ల ధరలను కూడా తగ్గించేసింది.