- 2014 జూన్ 2 నుంచి 1,115 మంది రైతుల ఆత్మహత్య
- పరిహారం పెంచినా బాధిత కుటుంబాలకు వర్తించని వైనం
- బలవన్మరణాలకు పాల్పడింది 409 మందేనని సర్కారు కాకిలెక్కలు
సాక్షి, హైదరాబాద్: పంటనష్టం ఆవేదనతో, అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం... పరిహారం ప్రకటనలో మాత్రం వారికి అన్యాయమే చేసింది. ఇప్పటికే తమ ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు... పెంచిన పరిహారం వర్తించదని చెప్పి మరింత నిర్వేదంలో కూరుకుపోయేలా చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (2014, జూన్ 2) నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,100 మందికి పైగా రైతులు బలవన్మరణం చెందగా... వారి కుటుంబాలను ప్రభుత్వం విస్మరించింది. శనివారం నుంచి జరిగే ఘటనలకు మాత్రమే రూ.6 లక్షల కొత్త పరిహారం వర్తిస్తుందని ప్రకటించింది. ఇందులో రూ.5 లక్షలు బాధిత కుటుంబాలకు అందజేసి, మిగతా రూ.లక్షతో వన్‌టైం సెటిల్‌మెంట్ కింద అప్పులు తీరుస్తామని పేర్కొంది. అయితే వన్‌టైం సెటిల్‌మెంట్‌లో ప్రైవేటు అప్పులు మాత్రమే కాకుండా బ్యాంకు రుణాలు కూడా తీర్చాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై సర్కారు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
అన్నీ తప్పుడు లెక్కలే!
ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల సంఖ్యపైనా సర్కారు కాకిలెక్కలు చూపుతోంది. ఇటీవల సర్కారు వెల్లడించిన లెక్కల ప్రకారం 409 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 141 మంది మాత్రమే వ్యవసాయ సంబంధిత అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు. మిగతా వారికి సంబంధించి విచారణ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దాన్ని వ్యవసాయ సంబంధిత అప్పుల కారణంగా ఆత్మహత్యగా ప్రభుత్వం పరిగణించడం లేదు. ఇలా అనేక కొర్రీలు పెడుతోంది. అయితే రైతు సంఘాలు వేసిన లెక్కల ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల సంఖ్య 1,115కు పైనే.
అన్నదాతలకు పరిహాసమే!
Published Sun, Sep 20 2015 2:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement