న్యూఢిల్లీ: దేశంలో ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్ (వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోతే విద్యార్థిని తిరిగి అదే తరగతిలో కొనసాగించడం) విధానం అమల్లో లేకపోవడం విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతకరమని పార్లమెంటు స్థాయీ సంఘం స్పష్టం చేసింది. తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన లేకపోవడం వల్ల విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యం, వికాసం, అభివృద్ధి తగ్గిపోతుందని హెచ్చరించింది.
విద్యా హక్కు చట్టం ప్రకారం కూడా 8వ తరగతి వరకు ‘డిటెన్షన్’ విధానం లేకపోవడం సరికాదని పేర్కొంటూ పార్లమెంటుకు గురువారం తమ నివేదికను సమర్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన లేదు. ఏదైనా తరగతి పూర్తికాగానే విద్యార్థులు పైతరగతికి వెళ్తున్నారు.