వైజాగ్‌లో రూ.350 కోట్లతో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రవాణా సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ (కాంకర్) వైజాగ్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు చేస్తోంది. రూ.350 కోట్లతో 100 ఎకరాల్లో రానుంది. రెండున్నరేళ్లలో ఇది పూర్తి కానుందని కాంకర్ దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరై క్టర్ వి.కల్యాణరామ తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో మొత్తం 15 పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందుకోసం రూ.6,000 కోట్లు వ్యయం చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్కొక్కటి కనీసం 100 నుంచి 400 ఎకరాల దాకా ఉంటుందని వివరించారు. బుధవారమిక్కడ సీఐఐ ఏర్పాటు చేసిన ఎగ్జిమ్ కాన్‌క్లేవ్ 2013లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రైవేటు భాగస్వామ్యంతో..: పార్కుల ఏర్పాటులో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని కల్యాణరామ పేర్కొన్నారు. గిడ్డంగి, ఇన్‌లాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ), ప్రైవేటు ఫ్రైట్ టెర్మినల్, ప్యాకేజింగ్, పంపిణీ వంటి సౌకర్యాలు పార్కులో ఉంటాయన్నారు. 15 పార్కులకుగాను ప్రైవేటు కంపెనీల నుంచి వాటా కింద రూ.2,500-3,000 కోట్లు ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 5 డిపోలను కాంకర్ నిర్వహిస్తోంది. ఇందులో పటాన్‌చెరు సమీపంలోని నాగులపల్లి డిపోను విస్తరిస్తున్నారు. కృష్ణపట్నం, కరీంనగర్‌లో డిపోల ఏర్పాటుకు కంపెనీ యోచిస్తోంది.
2012-13లో కాంకర్ చేపట్టిన సరుకు రవాణా పరిమాణం 25 లక్షల టీఈయూలు (ట్వెంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం వృద్ధి ఆశిస్తోంది.