Concor
-
రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ సరఫరాలో సరికొత్త అధ్యాయానికి భారతి సిమెంట్, కాంకర్ గ్రూప్ నాంది పలికాయి. భారత్‌లో తొలిసారిగా రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాను ప్రా రంభించాయి. ఇందుకోసం కాంకర్ గ్రూప్ రూపొం దించిన 20 అడుగుల కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్స్, లైనర్స్‌తో కూడిన బాక్స్ కంటైనర్స్‌ను కంపెనీ వినియోగించింది. వికా గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన భారతి సిమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద ప్లాంటు ఉంది. ఈ కేంద్రం నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బల్క్ సిమెంట్‌తో కూడిన రైలు శుక్రవారం ప్రారంభమైంది. ప్రధాన మార్కెట్లు అయిన చెన్నై, నైరుతీ తమిళనాడు, కేరళకు ఈ విధానంలో సిమెంట్ సరఫరా చేయనున్నట్టు భారత్‌లో వికా గ్రూప్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. కోయంబత్తూరులో ప్రత్యేక ప్యాకేజింగ్ టెర్మినల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కంటైనర్లు, అత్యాధునిక టెర్మినల్ కోసం రూ.130 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యాయం.. రైలు ద్వారా బల్క్ సిమెంట్ సరఫరాతో రవాణా ఖర్చులు, కర్బన ఉద్గారాలు తగ్గుతాయని సక్సేనా తెలిపారు. ‘కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించే వీలు అవుతుంది. భారతి సిమెంట్ మొదటిసారిగా స్వీకరించిన ఈ మోడల్ దేశంలో సిమెంట్ రవాణాలో విప్తవాత్మక మార్పులతోపాటు నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని వివరించారు. ఎర్రగుంట్ల ప్లాంటు నుంచి తొలి రైలును జెండా ఊపి సక్సేనా ప్రారంభించారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ డైరెక్టర్లు ఎం.రవీందర్ రెడ్డి, జి.బాలాజీ, జె.జె.రెడ్డి, హరీష్ కామర్తి, ఎరిక్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్.ధనుంజయులు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, కాంకర్ ఈడీ శేషగిరి రావు పాల్గొన్నారు. రైల్వే బోర్డ్ మెంబర్ ఆపరేషన్, బిజినెస్ డెవలప్మెంట్ సంజయ్ మహంతి, కాంకర్ ఎండీ వి.కళ్యాణ రామ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాలుపంచుకున్నారు. వేగంగా సిమెంట్ రవాణా .. ప్రత్యేక కంటైనర్లలో బల్క్ సిమెంట్ రవాణా వల్ల తయారీ కంపెనీలతోపాటు తమ సంస్థకు మేలు చేకూరుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు వేగంగా సిమెంట్ రవాణా సాధ్యపడుతుందని అన్నారు. -
‘కాంకర్ని కూడా ప్రైవేటీకరిస్తాం’.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనిట్లలో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగే ప్రక్రియేనని.. ఈ జాబితాలో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సభ్యుల ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ మొదలు పెట్టింది కాంకర్లో పెట్టుబడుల ఉపసంహరణ అన్నది 1994–95 కాంగ్రెస్ పాలనలోనే మొదలైనట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనూ కాంకర్లో పెట్టుబడుల విక్రయానికి ప్రయత్నించినట్టు గుర్తు చేశారు. ‘1994–95లో కాంకర్లో 20 శాతం వాటాను విక్రయించారు. 995–96లోనూ కాంగ్రెస్ సర్కారు మరో 3.05 శాతం వాటాను విక్రయించింది. కాంగ్రెస్ హయాంలో కాంకర్లో మొత్తం 24.35 శాతం వాటాను విక్రయిస్తే.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు 20.3 శాతం వాటాను విక్రయించాయి’’ అని సభ ముందు వివరాలు ఉంచారు. -
అఫ్లే అప్పర్ సర్క్యూట్- కుప్పకూలిన కంకార్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మొబైల్ మార్కెటింగ్ కంపెనీ అఫ్లే ఇండియా లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో పీఎస్‌యూ దిగ్గజం కంటెయినర్ కార్పొరేషన్(కంకార్) లిమిటెడ్ నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. దీంతో అఫ్లే ఇండియా కౌంటర్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు క్యూకట్టగా.. కంకార్ కౌంటర్లో భారీ అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి అఫ్లే ఇండియా అప్పర్ సర్క్యూట్‌ను తాకగా.. నవరత్న కంపెనీ కంకార్ భారీ నష్టాలతో కుప్పకూలింది. వివరాలు చూద్దాం.. అఫ్లే ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అఫ్లే ఇండియా నికర లాభం 42 శాతం పెరిగి రూ. 19 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం బలపడి రూ. 90 కోట్లను తాకింది. ఇబిటా 20 శాతం వృద్ధితో రూ. 22 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో అఫ్లే ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం10 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 2026 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. గత 4 నెలల్లో ఈ షేరు 81 శాతం ర్యాలీ చేయడం విశేషం! కంటెయినర్ కార్పొరేషన్ కార్గొ టెర్మినల్స్ నిర్వాహక దిగ్గజం కంటెయినర్ కార్పొరేషన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో 76 శాతం పడిపోయింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 58 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1723 కోట్ల నుంచి రూ. 1252 కోట్లకు క్షీణించింది. ఇబిటా మార్జిన్లు 24.6 శాతం నుంచి 13.4 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో కంకార్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 15 శాతం కుప్పకూలింది. రూ. 387 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 366 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
హైదరాబాద్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్
♦ 2019 నాటికి రెడీ అయ్యే చాన్స్ ♦ కాకినాడ, కృష్ణపట్నంలో కూడా ఏర్పాటు చేస్తాం ♦ కంటైనర్ కార్పొరేషన్ సీజీఎం రవి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ 2019 నాటికి సిద్ధం కానుంది. లింగంపల్లి సమీపంలోని నాగులపల్లి వద్ద ముంబై రైల్వే లైన్‌కు ఆనుకుని 100 ఎకరాల్లో ఇది రానుంది. ఇప్పటికే ఇక్కడ 16 ఎకరాల్లో కంటైనర్ టెర్మినల్‌ను కాంకర్ నిర్వహిస్తోంది. మిగిలిన స్థలం చేతికి రాగానే 24 నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని కాంకర్ సీజీఎం జి.రవి కుమార్ చెప్పారు. రైల్వేలైన్లు, గిడ్డంగులు, ఇతర వసతులకుగాను రూ.300 కోట్ల దాకా వ్యయం అవుతుందని అంచనాగా చెప్పారాయన. మారిటైమ్ గేట్‌వే మీడియా శుక్రవారం నిర్వహించిన స్మార్ట్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఇటీవలే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇటువంటి పార్క్‌లు కాకినాడ, కృష్ణపట్నం వద్ద కూడా రానున్నాయని తెలిపారు. విశాఖపట్నం పార్క్‌కు రూ.300 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో రూ.200 కోట్లు వ్యయం చేయనున్నారు. అయిదేళ్లలో రూ.8,000 కోట్లు.. కాంకర్ ప్రస్తుతం 72 ప్రాంతాల్లో భారీ గిడ్డంగులతో కార్యకలాపాలు సాగిస్తోంది. మూడేళ్లలో 100 కేంద్రాలను చేరుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో ఏడు ప్రాజెక్టులను పూర్తి చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 10–12 శాతం వ్యాపార వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది. మౌలిక వసతులు, ఐటీ వ్యవస్థ కోసం వచ్చే అయిదేళ్లలో కాంకర్ రూ.8,000 కోట్ల దాకా పెట్టుబడి పెడుతోంది. అంతర్గత వనరుల ద్వారా ఈ నిధులను వెచ్చించనుంది. ప్రస్తుతం సంస్థ గిడ్డంగుల సామర్థ్యం 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. 2020 నాటికి ఇది 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరనుంది. జీఎస్టీ రాకతో రానున్న రోజుల్లో గిడ్డంగుల అవసరం పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో కంటైనర్ టెర్మినల్‌ను కాంకర్ నిర్వహిస్తోంది. -
వైజాగ్‌లో రూ.350 కోట్లతో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రవాణా సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ (కాంకర్) వైజాగ్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు చేస్తోంది. రూ.350 కోట్లతో 100 ఎకరాల్లో రానుంది. రెండున్నరేళ్లలో ఇది పూర్తి కానుందని కాంకర్ దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరై క్టర్ వి.కల్యాణరామ తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో మొత్తం 15 పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందుకోసం రూ.6,000 కోట్లు వ్యయం చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్కొక్కటి కనీసం 100 నుంచి 400 ఎకరాల దాకా ఉంటుందని వివరించారు. బుధవారమిక్కడ సీఐఐ ఏర్పాటు చేసిన ఎగ్జిమ్ కాన్క్లేవ్ 2013లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రైవేటు భాగస్వామ్యంతో..: పార్కుల ఏర్పాటులో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని కల్యాణరామ పేర్కొన్నారు. గిడ్డంగి, ఇన్లాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ), ప్రైవేటు ఫ్రైట్ టెర్మినల్, ప్యాకేజింగ్, పంపిణీ వంటి సౌకర్యాలు పార్కులో ఉంటాయన్నారు. 15 పార్కులకుగాను ప్రైవేటు కంపెనీల నుంచి వాటా కింద రూ.2,500-3,000 కోట్లు ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 5 డిపోలను కాంకర్ నిర్వహిస్తోంది. ఇందులో పటాన్చెరు సమీపంలోని నాగులపల్లి డిపోను విస్తరిస్తున్నారు. కృష్ణపట్నం, కరీంనగర్లో డిపోల ఏర్పాటుకు కంపెనీ యోచిస్తోంది. 2012-13లో కాంకర్ చేపట్టిన సరుకు రవాణా పరిమాణం 25 లక్షల టీఈయూలు (ట్వెంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం వృద్ధి ఆశిస్తోంది.