మీడియా - లాయర్లు డిష్యుం డిష్యుం
కేరళలో ఇప్పుడు మీడియాకు, లాయర్లకు మధ్య ఒకరకమైన యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఇద్దరూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దాంతో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్స్టాప్ పెట్టాలని ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల అన్నారు.
కోర్టు తీర్పులను కోర్టు కార్యాలయం నుంచి పొందేవరకు ఊరుకోవాలని.. అప్పటివరకు అసౌకర్యాన్ని భరించాలని మీడియాకు కేరళ హైకోర్టు అధికారులు మంగళవారం నాడు చెప్పారు. హత్యకేసులో తీర్పు వెల్లడించే సమయంలో మీడియాను కోర్టు హాల‍్లోకి అనుమతించబోమని లాయర్లు కొల్లాం జిల్లా కోర్టుకు చెప్పారు. తమను లోనికి అనుమతించడం లేదు కాబట్టి, పోలీసులు అందించే సమాచారం మీదే ఆధారపడాల్సి ఉంటుందని పాత్రికేయులు అంటున్నారు. ఈ గొడవ అంతా కేరళ హైకోర్టులోనే మొదలైంది. అక్కడ ఇరువర్గాల వారు దాదాపు కొట్టుకున్నంత పనైంది. తిరువనంతపురం జిల్లాకోర్టు గేట్లను లాయర్లు మూసేసి.. బయట ఉన్న జర్నలిస్టులపై రాళ‍్లు విసిరారు. దాంతో ఐదుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. దాంతో ఈ విషయం ఏంటో చూడాలని జస్టిస్ కురియన్ జోసెఫ్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. చివరకు కేరళ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశమై, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇరు వర్గాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం పినరయి విజయన్ కూడా.. గొడవ పెద్దది కాకుండా చూసుకోవాలన్నారు. కోర్టులలోకి తమను రానివ్వకపోవడంపై పాత్రికేయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.