ప్రజలను తప్పుదారి పట్టించిన మోడీ: కాంగ్రెస్
చండీగఢ్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరించేస్తామన్నట్టుగా మోడీ ప్రచారం చేశారని చెప్పారు. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా గడవకముందే పెట్రోల్, డీజిల్ ధరలు, రైల్వే చార్జీలు పెంచేశారని గుర్తు చేశారు.
కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా దిగిరాలేదని వెల్లడించారు. దీని గురించి మోడీ ఎక్కడా మాట్లాడడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చైనా తోక కత్తిరిస్తామని చెప్పిన ఎన్డీఏ ఇప్పుడు... అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తన అధికార పటంలో చూపించినా నోరు మెదపడం లేదని షకీల్ అహ్మద్ ఎద్దేవా చేశారు.