మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మోడీ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మోడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.
రాహుల్ గాంధీ వంశం కారణంగా దేశంలో వ్యవస్థలు భ్రష్టుపట్టాయని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కోర్బా నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీ వ్యాఖ్యానించారు. ‘‘ఈ వ్యవస్థను ఇలా తయారు చేసింది ఈ షెహజాదా (యువరాజు) తండ్రి రాజీవ్, నానమ్మ ఇందిర, ముత్తాత నెహ్రూలే. అదాయనకు తెలియదేమో. దేశాన్ని అమ్ముకునే వారికన్నా టీ అమ్ముకునేవారే నయం. కాంగ్రెస్ నేతలు పేదలను అవమానిస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ కలలు కన్నారని, దాన్నిప్పుడు ప్రజలు సాకారం చేయాలంటూ పిలుపునిచ్చారు.