జనం మెచ్చని జోడీ.. విడాకులే దారి
- ఎస్పీతో కాంగ్రెస్ తలాక్
లక్నో: ‘ఈ జోడీ ప్రజలకు నచ్చింది.. బంపర్ మెజారిటీ గెలిపిస్తారు..’ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ మధ్య పొత్తుపై సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలివి. సీన్ కట్‌చేస్తే ‘జనం మెచ్చని జోడీకి విడాకులే దారి.. ఎస్పీతో పొత్తుకు రాంరాం..’ అని ప్రకటించారు కాంగ్రెస్ నేతలు! ఆదివారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మీడియాకు చెప్పారు. యూపీ వ్యవహారాల ఇన్‌చార్జి గులామ్ నబీ ఆజాద్ సహా కీలక నేతల సమక్షంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అఖిలేశ్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల.. ఆయనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా దారుణంగా నష్టపోయిందని భేటీలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
‘3కే’ ఫార్ములాకు పునరంకితం..
సమాజ్‌వాదీ పార్టీతో తెగదెంపుల అనంతరం తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించిన ‘3కే’ ఫార్ములాకు పునరంకితం అవుతున్నట్లు యూపీ కాంగ్రెస్ ప్రకటించింది. కోల్పోయిన చరిష్మాను తిరిగి సాధించుకోవడం కాంగ్రెస్‌కు తెలుసని, అతి త్వరలోనే నేలకు కొట్టిన బంతిలా దూసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ సూచించిన ‘కార్యకర్త.. కార్యాలయం.. కార్యక్రమం..’ అనే 3కే ఫార్ములాతో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం కలుగజేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు.