ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని కాంగ్రెస్
ప్రజాసంస్థలతో మంత్రులకు సంబంధాలు తప్పుకాదు
బీజేపీ-ఆరెస్సెస్ సమన్వయభేటీలో అన్ని అంశాలపై చర్చించాం
రాజ్యాంగేతర శక్తిగా పనిచేసిన సోనియా
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దగలిగాం
ఏపీ ప్రత్యేక హోదాపై రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తోంది
సాక్షి ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్
న్యూఢిల్లీ: ప్రజాసంస్థలతో కేంద్ర మంత్రులు నిరంతరం సంబంధాలను కలిగి ఉండడంలో ఎలాంటి తప్పూ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. ఆరెస్సెస్-బీజేపీ సమన్వయ భేటీకి హాజరైన కేంద్ర మంత్రులను విపక్ష ం విమర్శించడంపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంపై ఎన్నడూ విశ్వాసం లేని కాంగ్రెస్.. ఈ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఆరెస్సెస్-బీజేపీ భేటీపై విమర్శలు, ఏపీ, తెలంగాణ అంశాలపై మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంమాధవ్ చెప్పిన సమాధానాలు.
ప్రశ్న: పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాల్సిన కేంద్రం ఆరెస్సెస్ ముందు మోకరిల్లిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది?
ప్రజా తిరస్కరణకు గురైన కాంగ్రెస్ అది సహించలేక ప్రభుత్వం, పార్టీ, ఆరెస్సెస్‌పై అభాండాలు వేయడం హాస్యాస్పదం. కుటుంబపాలనతో గడుపుతూ వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలతో పార్టీ, ప్రభుత్వంలో ఉండే మంత్రులు మాట్లాడ్డం అపరాధమనడం హాస్యాస్పదం. మంత్రులు ప్రజా సంస్థలతో ప్రజలతో నిరంతరం సంబంధాలను కలిగి ఉండడంలో తప్పులేదు. కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగ విరుద్ధమైన పాలనను చాలా చూశాం. పీవీ ప్రధానిగా ఉన్న రోజుల్లో సోనియా అదనపు రాజ్యాంగ అథారిటీగా మారి ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. ప్రభుత్వ పైళ్లను తన ఇంటికి తెప్పించుకున్న చరిత్ర దేశ ప్రజలకు తెలుసు. సీఐఐ, ఫిక్కీ, మీడియా వాళ్లు పిలిచినా ప్రభుత్వం వెళుతుంది. మంత్రులు ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్లరా? దేశం ముందున్న ప్రధాన సమస్యలపై ఒకే ఆలోచనవిధానంతో ఉన్న సంస్థల సభ్యులం అంతా కలిసి కూర్చొని అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాం. ప్రభుత్వ, మంత్రుల పనితీరుపై సమీక్ష జరగలేదు.
ప్రశ్న: సామాన్యుల ఇబ్బందులపై సమన్వయభేటీలో ఏమైనా చర్చ జరిగిందా?
దేశ ప్రజల సమస్యలపై చర్చ జరిగింది. ద్రవ్యోల్బణం కాంగ్రెస్ హయాంలో 10 శాతానికి పైగా ఉండగా, ఎన్డీఏ పాలనలో 4 శాతం లోపే ఉంది. ధరల నియంత్రణలో చేపట్టిన చర్యల వల్ల కుదేలైన ఆర్ధిక వ్యవస్థను బయటపడేయటంలో సఫలీకృతులయ్యాం.
ప్రశ్న: ప్రభుత్వ, మంత్రుల పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చిన ఆరెస్సెస్ దిద్దుకోడానికి ఏమైనా దిశానిర్ధేశం చేసిందా?
సమావేశంలో సంస్థల ప్రతినిధులు ఎప్పుడు వంద శాతం సంతృప్తి అవడం సాధ్యం కాదు. ప్రభుత్వం సరైన దిశలో సాగుతోంది. ఇంకా బాగా పనిచేయాలి, త్వరగా పనిచేయాలని కోరుకోవడం సహజం.
ప్రశ్న: రామమందిరం విషయంలో వీహెచ్‌పీ అసంతృప్తి వ్యక్తం చేయడంపై?
ప్రజాస్వామ్యంలో అలాంటి అభిప్రాయాలు కలిగి ఉండడం, వ్యక్తీకరించడంలో ఎలాంటి తప్పులేదు.
ప్రశ్న: ప్రభుత్వం విపక్షాలతో ఘర్షణపూరిత దోరణితో ఉందని విమర్శలున్నాయి?
అధికార పార్టీ నిర్మాణాత్మకంగా అందరిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. సమావేశాలకు సహకరించాలని ప్రధాని మోదీ అనేక మార్పులకు పిలుపునిచ్చారు. లలిత్‌గేట్ స్కాం కాదు. విపక్షాలు రాజకీయ దురుద్దేశంతో లేని విషయాలపై ఘర్షణ చేస్తూ పార్లమెంటు నడవనీయడంలేదు. వ్యతిరేకత, నిరసన వ్యక్తంచేసే హక్కు విపక్షాలకు ఉంది. కానీ ఇతర అంశాలపై సభలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. జీఎస్టీ సహా ఇతర బిల్లులు దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడానికి చాలా అవసరం. ప్రత్యేక సమావేశంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.
ప్రశ్న: ఏపీలో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలుగువారిగా పార్టీలో జాతీయ స్థాయిలో ఉన్న మీ స్పందన?
రాష్ట్రానికి అవసరమైన నిధులు, ఆర్ధిక సహకారం కోసం ఏపీ సీఎం కేంద్రంతో మాట్లాడుతున్నారు. బాధ్యులుగా మేం కూడా మాట్లాడుతున్నాం. ఏ విధంగా ముందుకు వెళ్లడమనేది చూద్దాం. ప్రత్యేక హోదాను భావోద్వేగ అంశంగా తీసుకుని ప్రాణాలకు హానీ చేసుకునే చర్యలకు పాల్పడవద్దు. ఏపీ, తెలంగాణలకు మంచి జరగాలి.