
ఐదో రోజూ అదేతీరు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ఐదోరోజూ ప్రతిష్టంభన కొనసాగింది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన సభ్యులు తమ ప్రాంతాల సమస్యలపై నిరసన తెలిపారు. గందరగోళం మధ్యే ప్రభుత్వం మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టడం మినహా చెప్పుకోదగిన కార్యక్రమాలేవీ లేకుండానే ఉభయ సభలూ బుధవారానికి వారుుదాపడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్ హీరాకుడ్ పడవ ప్రమాదం, పశ్చిమబెంగాల్‌లో ట్రక్కు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే సభలో సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు మార్మోగాయి.
ఈ గందరగోళంలోనే సభాపతి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించినా నినాదాలు కొనసాగడంతో మూడు నిమిషాల్లోనే సభ 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభం కాగానే వివిధ పార్టీలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సీమాంధ్ర ఎంపీలు వెల్‌లో నినాదాలు చేస్తున్న సమయంలో ఆ ప్రాంత కేంద్ర మంత్రులు పలువురు వారివారి స్థానాల్లో నిల్చొని రాష్ట్ర విభజనపై తమ నిరసన తెలిపారు. ఈ సమయంలోనే స్పీకర్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు వచ్చినట్లు తెలిపారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దీనిపై నిర్ణయం కోసం అవసరమైన ప్రక్రియ చేపట్టేందుకు సభ అదుపులో లేదని తెలుపుతూ.. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని కోరారు. ఈ క్రమంలోనే పలువురు మంత్రులు తమ శాఖలకు చెందిన వార్షిక నివేదికలను సభ ముందుంచారు.
రాష్ట్రానికి చెందిన జేడీ శీలం, బలరాం నాయక్‌లు వీరిలో ఉన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జేడీ(యూ) సభ్యులు పోస్టర్లు ప్రదర్శించారు. ముంబైలో డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ మెమోరియల్ ఏర్పాటుకు నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి స్థల సేకరణ చేపట్టేందుకు రూపొందించిన బిల్లును కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు సభలో గందరగోళం యథావిధిగా కొనసాగుతుండటంతో మధ్యాహ్నం 12.11 గంటల సమయంలో స్పీకర్ సభను మర్నాడికి వాయిదా వేశారు.
రాజ్యసభ పలుమార్లు వారుుదా
ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల ఢిల్లీలో మణిపురి బాలికపై జరిగిన అత్యాచార సంఘటనపై సభ్యుడు బీరేంద్రప్రసాద్ బైష్యా మాట్లాడటం ప్రారంభించారు. మరోవైపు పోడియం వద్ద సీమాంధ్ర ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, సీఎం రమేశ్, వై.ఎస్.చౌదరి తదితరులు ప్లకార్డులు పట్టుకుని సమైక్యాంధ్ర నినాదాలు ప్రారంభించారు. వీరితోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన సభ్యులు కూడా ఆందోళనకు దిగడంతో చైర్మన్ హమీద్ అన్సారీ రెండు నిమిషాల్లోనే సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 11.11 గంటలకు సభ ప్రారంభమైనా అదే పరిస్థితి కొనసాగింది.
దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక గందరగోళం కొనసాగుతుండగానే.. కేంద్ర మంత్రులు కిశోర్‌చంద్రదేవ్, జ్యోతిరాదిత్య సింథియా, మునియప్ప తదితరులు తమ శాఖలకు చెందిన వార్షిక నివేదికలను సభ ముందుంచారు. ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ హెచ్‌ఐవీ నిరోధం, నియంత్రణ బిల్లు-2014ను సభలో ప్రవేశపెట్టారు. 12.09 సమయంలో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైనప్పుడు కేంద్ర మంత్రి డాక్టర్ గిరిజావ్యాస్.. వీధుల్లోని చిన్నవ్యాపారుల రక్షణకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ అనుమతించారు. ఇంత గొడవ జరుగుతుంటే బిల్లు ఎలా ప్రవేశపెడతారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులు (సవరణ) బిల్లునూ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.