
మీరాకుమార్‌కు టీఆర్‌ఎస్ ఓట్లు: సంపత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేయనున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే 38 మంది ప్రజాప్రతినిధులు మీరాకుమార్‌కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, వీరిలో టీఆర్‌ఎస్ వాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ మీరాకుమార్ లోక్‌సభ స్పీకరుగా ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో చేసిన కృషిని మరిచిపోలేమన్నారు. ఇప్పటికైనా యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను చేతులెత్తి కోరుతున్నట్టుగా చెప్పారు.
రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని బీజేపీ కాళ్ల వద్ద తాకట్టుపెడుతున్న కేసీఆర్ తీరుపై టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సీబీఐ కేసుల నుంచి బయటçపడడానికే కేసీఆర్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మీరాకుమార్‌కు మద్దతు కూడగట్టడానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణలో 90 శాతం మంది ఆత్మప్రభోదానుసారం మీరాకుమార్‌కు ఓటు వేస్తారని చెప్పారు. మూడేళ్లుగా కేసీఆర్ కుటుంబసభ్యులైన నలుగురి కబంధహస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛగా ఓటువేయడానికి టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారని సంపత్‌కుమార్ పేర్కొన్నారు.