
రామచంద్రపురం రూరల్: ఏపీలో విద్యా సంస్కరణలు బాగున్నాయని, ఇప్పటికే ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని మేఘాలయ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.సంపత్‌కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను తన తల్లి ఈశ్వరమ్మతో కలసి బుధవారం ఆయన సందర్శించారు.
సంపత్‌కుమార్ ఇదే పాఠశాలలో 4వ తరగతి విద్యనభ్యసించగా, తల్లి ఈశ్వరమ్మ ఇక్కడ ఉపాధ్యాయినిగా పనిచేశారు. తాను పనిచేసిన పాఠశాలలను ఒక్కసారి చూడాలన్న తల్లి కోరికతో పాటు ఏపీలో జరుగుతోన్న విద్యా సంస్కరణలను పరిశీలించడానికి వచ్చినట్లు సంపత్‌కుమార్ తెలిపారు.
విద్యార్థులతో మాట్లాడిన ఆయన పట్టుదలతో శ్రమించాలని సూచించారు. మంచి చదువును అందిస్తే భవిష్యత్ తరాలు అద్భుతంగా మారతాయని ఆ దిశగా పనిచేస్తోన్న సీఎం జగన్ అభినందనీయుడన్నారు. సంపత్‌కుమార్ తల్లి ఈశ్వరమ్మను ఆర్జేడీ నాగమణి ఆధ్వర్యంలో సత్కరించారు.