ఐక్య ‘గర్జన’కు సిద్ధం కండి | Simha Garjana at warangal | Sakshi
Sakshi News home page

ఐక్య ‘గర్జన’కు సిద్ధం కండి

Published Mon, Jun 11 2018 1:05 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

Simha Garjana at warangal  - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: దళిత, గిరిజనుల రక్షణ చట్టాలను నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ఎదుర్కోవాలని నేతలు పిలుపునిచ్చారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడుల్ని తిప్పికొట్టేందుకు వరుసగా చేపట్టనున్న పోరాటాలు ఈ సింహగర్జనతో మొదలయ్యాయన్నారు.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ పేరుతో దళిత, గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో జరిగిన సింహగర్జనలో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ మాట్లాడుతూ.. ‘నేను ఎంపీగా ఉన్నపుడు బిహార్‌లో వరుసగా జరిగిన రెండు దాడుల్లో 25 మంది దళితులు చనిపోయారు.

ఈ విషయాన్ని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వివరించాను. అపుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రూపొందించారు. ఇంతకాలం రక్షణగా ఉన్న ఈ చట్టం.. సుప్రీం తీర్పుతో పదును కోల్పోయింది. చట్టాన్ని కాపాడేందుకు కేంద్రం ఆర్డినెన్స్‌ ఎందుకు తీసుకురాలేదు’అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉద్దేశపూర్వకంగానే కేంద్రం నీరుగారుస్తోందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్‌ చేశారు.  

డిప్యూటీ సీఎం చేసి తీసేశారు..
‘అనేక మంది దళితుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. కానీ దళిత సీఎం హామీ పక్కనబెట్టి కేసీఆర్‌ సీఎం అయ్యారు. దళితుడిని డిప్యూటీ సీఎం చేసి వెంటనే తీసేశారు. ఈ ఘటనలు బాధించాయి’ అని మీరాకుమార్‌ అన్నా రు.

రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌లకు అధికార పీఠం దక్కనివ్వబోమని, ఈ విషయాన్ని ఇక్కడున్న ఇంటెలిజెన్స్‌ ప్రభుత్వానికి చెప్పాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు పోరాడుతామని హామీ ఇచ్చారు.

దళిత, గిరిజనులు ఏకం కావాలి: సురవరం
అంతరంగిక సమస్యలు పక్కనబెట్టి అంతా ఏకం కావాలని దళిత, గిరిజనులకు సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజే పీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీలు ఏకమై  పోరాడాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రస్తుతమున్నట్లే కొనసాగించాలని, అలాగే దాడుల నుంచి రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చట్టం పరిరక్షణకు చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేసి విచారణ జరపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.రాజా డిమాండ్‌ చేశారు. ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌’అంటూ దళిత, గిరిజనుల పక్షాన ప్రధాని నిలవడం లేదన్నారు.

గుజరాత్‌ నుంచి గాంధీ, వల్లభాయ్‌ పటేల్, మోదీ వచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు.. కానీ మీసాలు పెంచినందుకు, క్లాస్‌ ఫస్ట్‌ వచ్చినందుకు, పెళ్లి బరాత్‌ నిర్వహించినందుకు దళితులపై దాడులు అక్కడే జరిగాయన్న విషయం మర్చిపోవద్దన్నారు. దళిత, గిరిజనులపై చర్యలకు వ్యతిరేకంగా జరుగబోయే వరుస పోరాటాలు ఇక్కడి నుంచే మొదలవుతాయన్నారు. ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్, సేవ్‌ నేషన్‌’ అని రాజా పిలుపునిచ్చారు.  

పాలకులయ్యేవరకు పోరాడాలి: రమణ
పాలితులుగా ఉండటం కాదు పాలకులు అయ్యే వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలసికట్టుగా పోరాడాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పిలుపునిచ్చారు. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గానికి ప్రతినిధి మంద కృష్ణ మాదిగను అకారణంగా జైలులో పెట్టారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణకు తన మద్దతు ఉంటుందని అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సింహగర్జనతో పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, కాంగ్రెస్‌ నేత కొప్పుల రాజు అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement