simha garjana
-
మోదీ మనసులో దళితులు లేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు స్థానం లేదని, ఆయన ప్రభుత్వానివి దళిత వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండో రోజు జరిగిన ‘సింహగర్జన’ ధర్నాలో రాహుల్ పాల్గొన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ జరిగే పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. చట్ట పరిరక్షణ సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే పూర్తి భద్రత ఏర్పడుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాల మధ్య అసమానతలు ఉన్నాయని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరేంటో తెలపాలని రాహుల్‌ను మంద కృష్ణ కోరారు. ఈ ధర్నాలో సమితి కన్వీనర్లు జేబీ రాజు, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ సహా పలు రాష్ట్రాల దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఢిల్లీలో మరో సింహగర్జన: మందకృష్ణ
హన్మకొండ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు ఢిల్లీ వేదికగా మరో సింహగర్జన నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ కమిటీ చైర్మన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సోమవారం ఆయన అట్రాసిటీ చట్టం పరిరక్షణ కమిటీ కన్వీనర్లు బెల్లయ్యనాయక్, చెన్నయ్యతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని అక్షరం పొల్లుపోకుండా అమలు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రావడానికి ముందు ఉద్యమం కారంచేడు సంఘటనతో మొదలైందని గుర్తు చేశారు. ఆ గ్రామంలో భూస్వామ్య ఆధిపత్యం పోరులో ఆరుగురు దళితులను హత్య చేశారన్నారు. అప్పటి పోరాటం ఫలితంగా కులం పేరుతో దూషించినా, అత్యాచారం చేసినా కఠిన శిక్ష పడేలా 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. కారంచేడు సంఘటన జూలై 17న జరిగిందని అదే రోజు ఢిల్లీలో మరో సింహగర్జనను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు రాహుల్ గాంధీ, దేవెగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌తో పాటు తమిళనాడులోని డీఎంకే, ఏఐడీఎంకేతోపాటు జమ్ముకాశ్మీర్, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకులందరిని ఆహ్వానిస్తామన్నారు. సింహగర్జనకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, సభ జరిగిన రోజు కడియం శ్రీహరిని స్వయంగా కలసి ఆహ్వానించామని, అయితే వారు ఎందుకు రాలేదో చెప్పాలని అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సింహగర్జనకు ఎందుకు రాలేదో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పాలన్నారు. -
దళిత, గిరిజనులు ఏకం కావాలి
-
ఐక్య ‘గర్జన’కు సిద్ధం కండి
సాక్షి ప్రతినిధి, వరంగల్: దళిత, గిరిజనుల రక్షణ చట్టాలను నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ఎదుర్కోవాలని నేతలు పిలుపునిచ్చారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడుల్ని తిప్పికొట్టేందుకు వరుసగా చేపట్టనున్న పోరాటాలు ఈ సింహగర్జనతో మొదలయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ పేరుతో దళిత, గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో జరిగిన సింహగర్జనలో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మాట్లాడుతూ.. ‘నేను ఎంపీగా ఉన్నపుడు బిహార్‌లో వరుసగా జరిగిన రెండు దాడుల్లో 25 మంది దళితులు చనిపోయారు. ఈ విషయాన్ని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వివరించాను. అపుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రూపొందించారు. ఇంతకాలం రక్షణగా ఉన్న ఈ చట్టం.. సుప్రీం తీర్పుతో పదును కోల్పోయింది. చట్టాన్ని కాపాడేందుకు కేంద్రం ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురాలేదు’అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉద్దేశపూర్వకంగానే కేంద్రం నీరుగారుస్తోందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం చేసి తీసేశారు.. ‘అనేక మంది దళితుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. కానీ దళిత సీఎం హామీ పక్కనబెట్టి కేసీఆర్ సీఎం అయ్యారు. దళితుడిని డిప్యూటీ సీఎం చేసి వెంటనే తీసేశారు. ఈ ఘటనలు బాధించాయి’ అని మీరాకుమార్ అన్నా రు. రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్లకు అధికార పీఠం దక్కనివ్వబోమని, ఈ విషయాన్ని ఇక్కడున్న ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి చెప్పాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు పోరాడుతామని హామీ ఇచ్చారు. దళిత, గిరిజనులు ఏకం కావాలి: సురవరం అంతరంగిక సమస్యలు పక్కనబెట్టి అంతా ఏకం కావాలని దళిత, గిరిజనులకు సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజే పీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీలు ఏకమై పోరాడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రస్తుతమున్నట్లే కొనసాగించాలని, అలాగే దాడుల నుంచి రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చట్టం పరిరక్షణకు చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.రాజా డిమాండ్ చేశారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అంటూ దళిత, గిరిజనుల పక్షాన ప్రధాని నిలవడం లేదన్నారు. గుజరాత్ నుంచి గాంధీ, వల్లభాయ్ పటేల్, మోదీ వచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు.. కానీ మీసాలు పెంచినందుకు, క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు, పెళ్లి బరాత్ నిర్వహించినందుకు దళితులపై దాడులు అక్కడే జరిగాయన్న విషయం మర్చిపోవద్దన్నారు. దళిత, గిరిజనులపై చర్యలకు వ్యతిరేకంగా జరుగబోయే వరుస పోరాటాలు ఇక్కడి నుంచే మొదలవుతాయన్నారు. ‘సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ నేషన్’ అని రాజా పిలుపునిచ్చారు. పాలకులయ్యేవరకు పోరాడాలి: రమణ పాలితులుగా ఉండటం కాదు పాలకులు అయ్యే వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలసికట్టుగా పోరాడాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పిలుపునిచ్చారు. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గానికి ప్రతినిధి మంద కృష్ణ మాదిగను అకారణంగా జైలులో పెట్టారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు తన మద్దతు ఉంటుందని అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సింహగర్జనతో పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ నేత కొప్పుల రాజు అన్నారు. -
నేడు ఓరుగల్లులో సింహగర్జన
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం ప్రకాశ్‌రెడ్డి పేటలో నిర్వహించే సింహగర్జనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 59 దళిత సంఘాలు, 31 గిరిజన సంఘాలు ఐక్యంగా ఈ సింహగర్జనను నిర్వహిస్తున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్తో పాటు జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి 9 వరకు సభ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దళిత, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. 30 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంలా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని రూపుమాపేందుకు కేంద్రం కుట్రపన్నిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సెక్షన్ 18కి విఘాతం కలగకుండా, సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరపకుండా ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పరిరక్షించడంతో పాటు భవిష్యత్‌లో దళిత, గిరిజనుల రక్షణ కోసం రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలను ఈ సభలో వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రకటించనున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత వస్తుండటంతో పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రులు కిశోర్ చంద్రదేవ్, సతీష్ జార్కోలి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.రాజు, అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్, అసదుద్దీన్ ఒవైసీ, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, చాడ వెంకట్‌రెడ్డి, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, చెరుకు సుధాకర్, ఎల్.రమణ, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు హాజరుకానున్నారు. -
30 లక్షల మందితో ‘సింహగర్జన’ సభ
హన్మకొండ అర్బన్ : ఈ నెల 10న హన్మకొండలో నిర్వహించనున్న దళిత, గిరిజన సింహగర్జన సభను 30 లక్షల మందితో నిర్వహించి.. విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ నాయకులు పిలుపునిచ్చారు. కాజీపేట నిట్ సమీపంలోని ఓ గార్డెన్లో బుధవారం రాత్రి అన్నమల్ల ఆనందం అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేబీ రాజు మాట్లాడుతూ కుట్రపూరితంగా ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని కోర్టుల ద్వారా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమయంలో ఎస్సీ,ఎస్టీలు చైతన్యంతో ఐక్యంగా ముందుకు సాగి హక్కులను కాపాడుకోవాలని, అంబేడ్కర్ ఆశయాలను సాధించుకోవాలని కోరారు. సంహగర్జన సభ విజయవంతంతో కుట్రలు భగ్నం చేయాలన్నారు. ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు గడ్డం తిరుపతి, ప్రధానకార్యదర్శి మందరాజు, జాతీయ నాయకులు రాజయ్య, తోట శ్రీనివాస్, మంద వీరస్వామి, ఉపేందర్, తిప్పారపు లక్ష్మణ్, కృష్ణయ్య, జాకబ్, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వల్లే కష్టాలు
న్యూస్‌లైన్, కామారెడ్డి: సెజ్‌ల పేరుతో కంపెనీలకు రూ. కోట్ల విలువైన భూములను, రూ. వేల కోట్ల రుణాలను ఇస్తున్న కాంగ్రెస్ ప్ర భుత్వం.. ఆర్థికంగా చితికిపోయిన గల్ఫ్ బాధితుల విషయం లో మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డిలోని సత్యాగార్డెన్‌లో గల్ఫ్ బాధితుల సింహగర్జన నిర్వహించారు. కార్యక్రమంలో మురళీధర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక యువతను గల్ఫ్‌కు పంపించే విషయంలో ఏజెంట్లు ఎన్నో రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అయినా ప్రభుత్వాలు ఏజెంట్ల ను జైల్లో పెట్టకుండా రక్షిస్తున్నాయని ఆరోపిం చారు. ఏజెంట్ల మోసాలకు బలైన వారెందరో గల్ఫ్‌లోని జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ ఉన్నా.. తెలంగాణలో పుష్కలంగా బొగ్గు ఉన్న సింగరేణిలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా.. యాజమాన్యాలు ఉన్న సిబ్బందినే తగ్గిస్తూ ద్రోహం చేస్తున్నాయని మురళీధర్‌రావు దుయ్యబట్టారు. గోదావరి నది పారుతున్నా తెలంగాణలో సాగునీరు అందని దుస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే యువత గల్ఫ్‌కు వలస వెళ్తున్నారని, ఎజెంట్ల మోసాలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధికంగా బాధించే సమస్య ప్రపంచంలో అత్యంతగా బాధించే సమస్య ‘గల్ఫ్ వ్యవహారం’ అని మురళీధర్‌రావు అన్నారు. తాళిబొట్లను, వ్యవసాయ భూములను అమ్ముకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఎందరో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో మరణిస్తున్న భారతీయుల మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్నారు. కనీసం శవాలను కూడా తెప్పించలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఎందరో గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నారన్నారు. బాధిత కుటుంబాలను కనీసం ప్రభుత్వ అధికారులైనా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పెళ్లి కాకముందే బిడ్డ పుట్టినరోజు.. తెలంగాణ బిల్లు పాస్ కాకముందే కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని మురళీధర్‌రావు విమర్శించారు. పెళ్లికాకముందే బిడ్డకు పుట్టిన రోజు చేసినట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. గల్ఫ్ బాధితుల సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, ప్రజల సమస్యలు పట్టించుకోని పాలకులకు సమాధి క ట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.