ఢిల్లీలో సింహగర్జనలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. చిత్రంలో ఏచూరీ, మందకృష్ణ మాదిగ, సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు స్థానం లేదని, ఆయన ప్రభుత్వానివి దళిత వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండో రోజు జరిగిన ‘సింహగర్జన’ ధర్నాలో రాహుల్ పాల్గొన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ జరిగే పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు.
బీజేపీ ఉద్దేశపూర్వకంగానే దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. చట్ట పరిరక్షణ సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చినప్పుడే పూర్తి భద్రత ఏర్పడుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాల మధ్య అసమానతలు ఉన్నాయని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరేంటో తెలపాలని రాహుల్‌ను మంద కృష్ణ కోరారు. ఈ ధర్నాలో సమితి కన్వీనర్లు జేబీ రాజు, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ సహా పలు రాష్ట్రాల దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment