హన్మకొండ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు ఢిల్లీ వేదికగా మరో సింహగర్జన నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ కమిటీ చైర్మన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సోమవారం ఆయన అట్రాసిటీ చట్టం పరిరక్షణ కమిటీ కన్వీనర్లు బెల్లయ్యనాయక్, చెన్నయ్యతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని అక్షరం పొల్లుపోకుండా అమలు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రావడానికి ముందు ఉద్యమం కారంచేడు సంఘటనతో మొదలైందని గుర్తు చేశారు.
ఆ గ్రామంలో భూస్వామ్య ఆధిపత్యం పోరులో ఆరుగురు దళితులను హత్య చేశారన్నారు. అప్పటి పోరాటం ఫలితంగా కులం పేరుతో దూషించినా, అత్యాచారం చేసినా కఠిన శిక్ష పడేలా 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. కారంచేడు సంఘటన జూలై 17న జరిగిందని అదే రోజు ఢిల్లీలో మరో సింహగర్జనను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు రాహుల్ గాంధీ, దేవెగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌తో పాటు తమిళనాడులోని డీఎంకే, ఏఐడీఎంకేతోపాటు జమ్ముకాశ్మీర్, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకులందరిని ఆహ్వానిస్తామన్నారు. సింహగర్జనకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని, సభ జరిగిన రోజు కడియం శ్రీహరిని స్వయంగా కలసి ఆహ్వానించామని, అయితే వారు ఎందుకు రాలేదో చెప్పాలని అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సింహగర్జనకు ఎందుకు రాలేదో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment