కాంగ్రెస్ వల్లే కష్టాలు | gulf victims simha garjana at nizamabad district | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ వల్లే కష్టాలు

Published Sat, Jan 11 2014 2:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

gulf victims simha garjana at nizamabad district

 న్యూస్‌లైన్, కామారెడ్డి: సెజ్‌ల పేరుతో కంపెనీలకు రూ. కోట్ల విలువైన భూములను, రూ. వేల కోట్ల రుణాలను ఇస్తున్న కాంగ్రెస్ ప్ర భుత్వం.. ఆర్థికంగా చితికిపోయిన గల్ఫ్ బాధితుల విషయం లో మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డిలోని సత్యాగార్డెన్‌లో గల్ఫ్ బాధితుల సింహగర్జన నిర్వహించారు. కార్యక్రమంలో మురళీధర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక యువతను గల్ఫ్‌కు పంపించే విషయంలో ఏజెంట్లు ఎన్నో రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అయినా ప్రభుత్వాలు ఏజెంట్ల ను జైల్లో పెట్టకుండా రక్షిస్తున్నాయని ఆరోపిం చారు. ఏజెంట్ల మోసాలకు బలైన వారెందరో గల్ఫ్‌లోని జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 అన్నీ ఉన్నా..
 తెలంగాణలో పుష్కలంగా బొగ్గు ఉన్న సింగరేణిలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా.. యాజమాన్యాలు ఉన్న సిబ్బందినే తగ్గిస్తూ ద్రోహం చేస్తున్నాయని మురళీధర్‌రావు దుయ్యబట్టారు. గోదావరి నది పారుతున్నా తెలంగాణలో సాగునీరు అందని దుస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే యువత గల్ఫ్‌కు వలస వెళ్తున్నారని, ఎజెంట్ల మోసాలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 అత్యధికంగా బాధించే సమస్య
 ప్రపంచంలో అత్యంతగా బాధించే సమస్య ‘గల్ఫ్ వ్యవహారం’ అని మురళీధర్‌రావు అన్నారు. తాళిబొట్లను, వ్యవసాయ భూములను అమ్ముకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఎందరో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో మరణిస్తున్న భారతీయుల మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్నారు. కనీసం శవాలను కూడా తెప్పించలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఎందరో గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నారన్నారు. బాధిత కుటుంబాలను కనీసం ప్రభుత్వ అధికారులైనా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
 
 పెళ్లి కాకముందే బిడ్డ పుట్టినరోజు..
 తెలంగాణ బిల్లు పాస్ కాకముందే కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని మురళీధర్‌రావు విమర్శించారు. పెళ్లికాకముందే బిడ్డకు పుట్టిన రోజు చేసినట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. గల్ఫ్ బాధితుల సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, ప్రజల సమస్యలు పట్టించుకోని పాలకులకు సమాధి క ట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement