న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత(ఎల్‌వోపీ) హోదా సాధించేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదంటూ అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. తన రాజకీయ పెద్దల మెప్పు పొందేందుకే ఏజీ ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారని ధ్వజమెత్తింది. కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్‌శర్మ శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏజీ వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఏజీ అభిప్రాయానికి ఆయన రాసిన కాగితం పాటి విలువ కూడా ఉండబోదన్నారు. రాజకీయ పెద్దల మెప్పు పొందేందుకు ఏజీ ఈ విధమైన అభిప్రాయాన్ని తెలిపారని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చట్టం, శాసనాల గురించి ఎంతో అవగాహన ఉండే ఏజీ ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయరాదని, ఇది తన పదవిని అవమానపరిచేలా ఉందని ఆనంద్‌శర్మ వ్యాఖ్యానించారు. ఎల్‌వోపీ విషయంలో స్పీకర్‌పైనా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆనంద్‌శర్మ ఆరోపించారు.
ఈ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించకుంటే.. కోర్టుల తలుపు తట్టే అవకాశం లేకపోలేదని చెప్పారు. ‘‘ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. స్పీకర్‌పైన ఒత్తిడి తెచ్చేందుకు సైతం వారు ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ నిష్పక్షపాత వైఖరితో వ్యవహరించాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏజీ అభిప్రాయాన్ని స్పీకర్ మహాజన్ తిరస్కరిస్తారని తాము భావిస్తున్నామని చెప్పారు. ఏదేమైనా స్పీకర్‌కు, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష అని పేర్కొన్నారు.