
అన్‌ఫాలో: కాంగ్రెస్‌కు సీనియర్ నేత ఝలక్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత దాదాపు ఝలక్ ఇచ్చారు. ఆయన ఆదివారం అనుకోకుండా ట్విట్టర్‌లో పార్టీ అధికారిక పేజీని, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేజీని 'అన్‌ఫాలో' కొట్టడం దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చిందా? ఆయన కూడా హస్తానికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. తన సిబ్బంది అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ ట్విట్టర్ పేజీలను 'అన్‌ఫాలో' కొట్టారని, వెంటనే జరిగిన పొరపాటును గుర్తించి తిరిగి ఆ పేజీలను అనుసరించడం మొదలుపెట్టారని సిబల్ తెలిపారు.
మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం కూడా కాంగ్రెస్, రాహుల్ అధికారిక పేజీల (@INCIndia, @OfficeOfRG)ను 'అన్‌ఫాలో' కొట్టినట్టు వార్తలు వచ్చాయి. సోమవారం ఉదయం చూస్తే చిదంబరం ట్విట్టర్ ఖాతాలు ఈ రెండు పేజీలను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నది. గుజరాత్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్‌సిన్హ్ వాఘేలా ఇదేవిధంగా రాహుల్‌గాంధీ ట్విట్టర్ పేజీని మే నెలలో 'అన్‌ఫాలో' కొట్టారు. గత నెలలో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.