ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్రం చేపట్టిన ప్రక్రియను వెంటనే ఆపాలని రాష్ట్ర మంత్రులు సాకె శైలజానాథ్, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, అహ్మదుల్లా ప్రధాని మన్మోహన్‌సిం గ్‌కు విన్నవించారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్రం చేపట్టిన ప్రక్రియను వెంటనే ఆపాలని రాష్ట్ర మంత్రులు సాకె శైలజానాథ్, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, అహ్మదుల్లా ప్రధాని మన్మోహన్‌సిం గ్‌కు విన్నవించారు. భారీవర్షాలు, వరద నష్టంపై వివరించి సాయం కోరడానికి సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్‌లతో కలిసి ప్రధాని వద్దకు వెళ్లిన సందర్భంగా ఈ నలుగురు మంత్రులు ఆయనకు విభజన వద్దంటూ వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర శాసనభ తీర్మానానికి వ్యతిరేకంగా దేశంలో ఏ రాష్ట్రమూ ఏర్పడలేదని, ప్రజాస్వామ్య భారతదేశంలో పద్ధతులు, సంప్రదాయాలకు రాజ్యాం గంలో లిఖితపూర్వకంగా ఉన్న అధికరణలు, నిబంధనలతో సమాన విలువనిచ్చి చూడాలని ఆ వినతిపత్రంలో మంత్రులు కోరారు. సీమాంధ్ర ప్రాంత ప్రజానీకం మనోభావాలను పట్టించుకోకుండా, వారినుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకుందని, కేంద్రం తీరుతో తామెంతో కలత చెందుతున్నామని పేర్కొన్నారు.
కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీమాంధ్రలో ప్రస్తుతం ఉధృతంగా ప్రజాందోళన సాగుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగ నిబంధనల మేరకు రాష్ట్ర విభజన బిల్లు, తీర్మానం రెండింటినీ రాష్ట్ర శాసనసభకు పంపించాలని, శాసనసభను పక్కనపెట్టి విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లరాదని కోరారు. ప్రధానికి వినతిపత్రం ఇచ్చాక ఏపీ భవన్ వద్ద శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం తరఫున తాము ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని, దిగ్విజయ్ అనుమతితోనే అది సమర్పించామని, తాను జాగ్రత్తగా చదువుతానని మన్మోహన్ స్పందించారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాము అన్ని అవకాశాలను, మార్గాలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు.