ములాయం హత్యకు కాంగ్రెస్ కుట్ర: మోదీ
ములాయం హత్యకు కాంగ్రెస్ కుట్ర: మోదీ
Published Thu, Feb 16 2017 9:11 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను చంపించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, అలాంటి పార్టీతో ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్న విషయాన్ని 1984లో స్వయంగా ములాయం సింగ్ యాదవే చెప్పారని గుర్తు చేశారు. ములాయం మీద హత్యాయత్నం జరిగిన తర్వాత.. చరణ్ సింగ్, వాజ్‌పేయి కలిసి రాష్ట్రాయ లోక్‌తాంత్రిక్ మోర్చాను ప్రారంభించి కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అధికారం కోసం.. తన తండ్రిని చంపేందుకు ప్రయత్నించినవాళ్లతో అఖిలేష్ చేతులు కలిపారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని చిబ్రాము నియోజకవర్గం పరిధిలోని గుర్సాయ్‌గంజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ విషయం తెలిపారు.
1984 మార్చి 4వ తేదీన ములాయం ఇటావా నుంచి లక్నో వెళ్తుండగా కారుపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, ఆ కేసులో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ ప్రముఖ యాదవ నాయకుడి పేరు బయటకు వచ్చిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ ఆ విషయాన్ని గతంలో చెప్పడమే కాక, ఇటీవల కూడా యాదవ్ కుటుంబంలో చెలరేగిన అంతర్యుద్ధం సమయంలో కూడా ప్రస్తావించారని మోదీ అన్నారు. ''కాంగ్రెస్ కన్నింగ్ అన్న విషయాన్ని అఖిలేష్ తెలుసుకోవడం లేదు. కానీ ములాయంకు తెలుసు'' అని ప్రధాని చెప్పారు.
రాజకీయాలు దారుణంగా దిగజారిపోయాయని, కుర్చీకోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. యూపీ విధాన పరిషత్తులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ పదే పదే ప్రభుత్వం మీద విరుచుకుపడటంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన మీద దాడి చేయించింది గానీ దాన్నుంచి ఆయన తప్పించుకున్నారన్నారు. కాంగ్రెస్ ఒళ్లో కూర్చునే ముందు అఖిలేష్ ఈ విషయాన్ని గుర్తుచేసుకోవాలని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను గౌరవిస్తానని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ అధికారం కోసం ఒక కాలు సమాజ్‌వాదీ పడవలోను, మరో కాలు బీఎస్పీ పడవలోను వేశారని ఎద్దేవా చేశారు.
Advertisement