నోటా తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనే
ఈవీఎంల ట్యాంపరింగ్‌ను రుజువు చేస్తాం: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈవీఎంలనుంచి నోటాను తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై ప్రజలకున్న అసంతృప్తి బయటపడుతుందనే భయంతోనే నోటాను తొలగించారని ఆరోపించారు. ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే విధంగా ఈవీఎంలకు ప్రింటర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, ఎన్నికల సంఘం ఆదేశించినా అమలు చేయలేదని విమర్శించారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని రుజువు చేసే ఆధారాలను చూపిస్తామని శ్రవణ్ అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, వారంతా టీఆర్‌ఎస్‌కు బానిసలయ్యారని శ్రవణ్ ఆరోపించారు. ట్యాంపరింగ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇతర పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంకోసం రూ.30 కోట్లు కేటాయించి, భారీ కోటను నిర్మించుకుంటున్నారని అన్నారు. ఇదేమన్నా రాజరికమా, తెలంగాణ రాజరిక వ్యవస్థలోకి వెళ్లిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు మిగులు బడ్జెట్ ఉండగా, ప్రస్తుతం రూ.60 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు.