మేయర్ ఎన్నికలో ఎన్నెన్ని ట్విస్టులో! | congress wins bangalore mayor election, needs high court nod | Sakshi
Sakshi News home page

మేయర్ ఎన్నికలో ఎన్నెన్ని ట్విస్టులో!

Published Fri, Sep 11 2015 3:35 PM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM

మేయర్ ఎన్నికలో ఎన్నెన్ని ట్విస్టులో! - Sakshi

మేయర్ ఎన్నికలో ఎన్నెన్ని ట్విస్టులో!

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు సినిమా ట్విస్టులను తలపిస్తున్నాయి. కార్పొరేషన్లో మెజారిటీ ఉన్నా.. తమ అభ్యర్థిని మేయర్గా గెలిపించుకోలేక బీజేపీ చతికిలబడింది. సొంత బలం లేకపోయినా, ఎమ్మెల్యేలు.. ఇతరుల బలంతో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకునే పరిస్థితికి వచ్చింది. కానీ.. హైకోర్టు తుదితీర్పును బట్టే ఈ ఎన్నిక ఆధారపడి ఉంటుంది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాల మేరకు నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఎన్ మంజునాథ రెడ్డి మేయర్గాను, జేడీ(ఎస్)కు చెందిన హేమలతా గోపాలయ్య డిప్యూటీ మేయర్గాను ఎన్నికయ్యారు.

బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. ఇక్కడ మొత్తం 198 వార్డులు ఉండగా వాటిలో 100 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్కు 76, జేడీ (ఎస్)కు 14 స్థానాలు దక్కగా ఇతరులు 8 చోట్ల గెలిచారు. ఎమ్మెల్యేలు, ఇతరుల బలంతో కలిపి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి మంజునాథరెడ్డికి 131 ఓట్లు వచ్చాయి.

అయితే.. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించిన తుది నిర్ణయం కర్ణాటక హైకోర్టు నుంచి వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని సవాలు చేస్తూ ఐదుగురు బీజేపీ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్లారు. మేయర్, డిప్యూటీమేయర్లుగా ఎన్నుకోవాలంటే 131 మంది సభ్యులు కావల్సి ఉంటుంది. బీబీఎంపీ మండలిలో మొత్తం 260 మందికి ఓటుహక్కు ఉంది. వాళ్లలో 62 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఉన్నారు. ఈ ఓట్లు కలిపితేనే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. దాంతో మేయర్గా తమ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోగలిగింది. అయితే, ఇలా ఎమ్మెల్యేలు తదితరులకు ఓటుహక్కు కల్పించే సెక్షన్ 7, 10లను సవాలుచేస్తూ బీజేపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. మేయర్ ఎన్నికను శుక్రవారం నిర్వహించుకోవచ్చిన హైకోర్టు చెప్పినా.. తుది నిర్ణయం మాత్రం తన రూలింగ్కు లోబడి ఉండాలని తెలిపింది. కార్పొరేటర్లు కానివాళ్లు కూడా మేయర్ ఎన్నికల్లో పాల్గొనడంపై రాజ్యాంగం ఏమంటోందన్న విషయాన్ని చూడాల్సి ఉందని జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement