
కానిస్టేబుల్‌కు 4 కార్లు, 6 ఇళ్లు!
అతడో సాధారణ ట్రాఫిక్ కానిస్టేబుల్. కానీ, అతడి ఆస్తిపాస్తులు చూస్తే మాత్రం కళ్లు తిరగక మానదు. అతగాడికి నాలుగు కార్లు, ఆరు ఇళ్లు, 8 బ్యాంకు ఖాతాలతో పాటు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగు చూసింది. అరుణ్ సింగ్ అనే ఈ హెడ్ కానిస్టేబుల్ ఇళ్ల మీద సోమవారం ఉదయం నుంచి లోకాయుక్త పోలీసులు దాడులు ప్రారంభించారు. మధ్యాహ్నానికి వాళ్ల చేతికి.. ఇండోర్ నగరంలో 6వేల చదరపు అడుగుల చొప్పున ఉన్న రెండు ప్లాట్లు, ఒక ఫాంహౌస్, రెండు ఫ్లాట్ల పత్రాలు లభించాయి.
వాటితోపాటు రేవా నగరంలో 25 ఎకరాల ఫాం హౌస్, 8వేల చదరపు అడుగుల చొప్పున రెండు ప్లాట్లు, రెండు ఇళ్ల డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అతడి వద్ద నుంచి నాలుగు కార్లు, 8 బ్యాంకు ఖాతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. చివరికి అతడి ఆస్తుల విలువ రూ. 5 కోట్లుగా నిర్ధారించారు. జబల్‌పూర్ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే అతడి ఆదాయంతో పోలిస్తే ఈ ఆస్తి చాలా రెట్లు ఎక్కువని పోలీసులు చెబుతున్నారు.