రాజధాని గ్రామాల్లో అవినీతి ‘సెంటు’
- పూలింగ్ రికార్డుల్లో తీవ్ర గందరగోళం..
- అనంతవరంలో భూముల గోల్‌మాల్
- లేని పేర్లు పుట్టుకొచ్చి భూములు ఇచ్చాయ్...
- రైతులు ఇచ్చిన భూమి తగ్గిపోయింది..
- ‘అయినవాళ్లు’ తక్కువిచ్చినా రికార్డుల్లో పెరిగింది
- లెక్కలు సరిచేయడానికి సవాలక్ష అవకతవకలు
- సహకరించిన సీఆర్‌డీఏ అధికారులకు నజరానాలు
- ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూసిన వాస్తవాలు
సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తోంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని పేరుతో అమరావతికి భూమిపూజ చేసి ఏడాది పూర్తయింది. ఇంతవరకు అక్కడ తట్ట మట్టి తవ్విపోయలేదు. నాలుగు ఇటుకలు పేర్చి ఓ గోడ కట్టలేదు. చివరకు కంకర రోడ్డు కూడా కానరావడం లేదు. కానీ... భూముల మాయాజాలం కొనసాగుతూనే ఉంది.రాజధానిని ప్రకటించక ముందే ప్రభుత్వ పెద్దలు ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’తో విలువైన భూములు కైంకర్యం చేశారు. అవసరం లేకపోయినా 34వేల ఎకరాలను సమీకరించారు. వాటికి పరిహారమిచ్చే ఈ తరుణంలో మరో తంత్రానికి తెరతీశారు.
భూములు లేకపోయినా ఉన్నట్టు కనికట్టు చేసి అధికారపార్టీ నేతలకు అందిస్తున్నారు.... అస్మదీయులైతే చాలు వారి భూమికి మరికాస్త చేర్చి చూపిస్తున్నారు. అదే సమయంలో సామాన్య రైతులకు ఉన్న భూమిని తగ్గించి చూపుతున్నారు. ఇలా తిమ్మిని బమ్మిని చేసి భూములు స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో, అధికారుల సాయంతో సాగుతున్న ఈ భూమాయకు చెందిన ఆధారాలను ‘సాక్షి’ సంపాదించింది. ఆ వివరాలివీ...
అనంతవరంలో అన్నీ తారుమారు..: రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో భూములకు డిమాండ్ బాగా పెరిగింది. రాజధాని నిర్మాణమెప్పుడో తెలియదు కానీ... ఆలోగా అందినంత భూమిని కాజేయాలని అధికారపార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. సీఆర్‌డీఏ అధికారుల సాయంతో బినామీల పేర్లతో భూములను ఆక్రమించుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా భూ రికార్డులు తారుమారు చేసి భోంచేస్తున్నారు. సహకరిస్తున్న అధికారులకు భారీగా నజరానాలు ముట్టజెపుతున్నారు. చిన్నచిన్న బిట్లు.. అంటే ఎకరం లోపు, అర ఎకరం లోపు ఎవరూ లెక్కలోకి తీసుకోరనే ఉద్దేశ్యంతో ఆ తరహాలో కైంకర్యం చేస్తున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన కొందరు రైతుల సహకారంతో ‘సాక్షి’ పక్కా ఆధారాలు సంపాదించింది.
రాజధాని పరిధిలోని అన్ని గ్రామాలలోనూ ఇలా భూ కైంకర్యం సాగుతోందని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. నిజానికి సీఆర్‌డీఏ 9.1 రికార్డుల (సమీకరణకు ముందు రికార్డులు) ప్రకారం భూ సమీకరణ నోటిఫికేషన్‌లో ఎంత ఉంటే అంతే సమీకరించాలి. కానీ రికార్డులు తారుమారు చేస్తున్నారు. 9.5 రికార్డుల ప్రకారం (సమీకరణ అనంతరం రికార్డులివి) భూములు ఇచ్చినట్లు సృష్టిస్తున్నారు. అంటే 9.1కి 9.5కి పొంతనే లేకుండా చేస్తున్నారన్నమాట. అనంతవరం గ్రామంలో మొత్తం 1,963 మందికి భూములు ఉన్నాయి. అర ఎకరం లోపు నుంచి ఎకరం పైన చిన్న చిన్న బిట్లుగా ఉన్నాయి. వీటిలో సగానికి పైగా భూముల రికార్డులను సీఆర్‌డీఏ అధికారులు తారుమారు చేశారు.
లెక్క సరిచేశారిలా: సర్వే నంబర్ 115లో శృంగారపాటి యలమంద అనే వ్యక్తికి ప్రభుత్వ రికార్డు ప్రకారం 2 ఎకరాల పొలం ఉంది. ఇతను సీఆర్‌డీఏకి 1.85 సెంట్లు ఇచ్చినట్లు ఉంది.అతను గొడవ చేయడంతో యలమందకి 144సీలో 7 సెంట్లు, 144ఏలో 03 సెంట్లు, 145బీలో 01 సెంటు, 154లో 13 సెంట్లు, 144జేలో 17సెంట్లు చొప్పున మొత్తం 41 సెంట్ల భూమిని కట్టబెట్టారు. దీనికి అధికారులకు రూ.20 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సర్వే నంబర్ 115లో భూమి ఉంటే.. భూమి తగ్గించటంతో ఐదు సర్వే నంబర్లలో ఉన్న రైతుల భూములను కత్తిరించి యలమందకు కట్టబెట్టటం గమనార్హం.
అధికారపార్టీ నేతలకు అందించారిలా...
రాజధాని కమిటీలో ఉన్న టీడీపీ నేత పారా కిషోర్‌కి సర్వే నంబర్ 287లో భూమి లేకపోయినా ఆయన తండ్రి సీతారామయ్య పేరుతో సీఆర్‌డీఏకు 0.82 సెంట్లు ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చారు. ఇలా సర్వే నంబర్ 168లో 9 సెంట్లు, సర్వే నంబర్ 70ఏలో పారా తులసమ్మ పేరుతో 12 సెంట్లు ఉన్న దానికన్నా పెరిగింది. సీతారామయ్య కుటుంబానికే మొత్తం 1.03 ఎకరాలను రికార్డుల్లో లేకపోయినా అధికారులు కట్టబెట్టారు. రాజధాని కమిటీలోని మరో సభ్యుడు సుంకర రామారావుకు సర్వే నంబర్ 54లో 70 సెంట్లు ఉంటే... 6 సెంట్లు కలిపారు. మరో టీడీపీ నేత నెల్లూరి అప్పారావు కుటుంబీకులు నెల్లూరి రాఘవయ్య పేరుతో సర్వే నంబర్ 119బీ, 120ఏలో మొత్తం 28 సెంట్లు చేర్చి విధేయతను చాటుకున్నారు. ఇలా ఒక్క అనంతవరంలో సుమారు 50 ఎకరాల వరకు కబ్జా చేశారు. మిగిలిన 28 గ్రామాల్లోనూ ప్రతి పల్లెలో 25 ఎకరాల నుంచి 50 ఎకరాలను ఆక్రమించుకునే ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో రాయపూడి గ్రామస్తులు కోర్టును ఆశ్రయించనున్నారు. వీరి బాటలోనే మరికొందరు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
మమ్మల్ని మోసం చేశారు...
రాజధాని కోసం ముందుగా భూములు ఇచ్చింది మేమే. మా భూములనే తగ్గించారు. మాకు 1.20 ఎకరాలు ఉంటే.. కొద్దిరోజుల క్రితం 25 సెంట్ల భూమిని మాయం చేశారు. సీఆర్‌డీఏ అధికారులు, ఎమ్మార్వో, వీఆర్వో, ఎమ్మెల్యే అందరూ కలసి మమ్మల్ని మోసం చేశారు. న్యాయం జరిగే వరకు వదిలేది లేదు. - బండ్ల బసవయ్య (అనంతవరం రైతు)