కట్టేది వారైతే మీకెందుకు బాధ?
జీఎస్టీపై వర్తకుల ఆందోళన అర్థరహితం: జైట్లీ
న్యూఢిల్లీ: జీఎస్టీ పన్నును అంతిమంగా వినియోగదారులు చెల్లిస్తుంటే కొందరు వర్తకులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆర్థిక మంత్రి జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన పన్ను రేట్ల అమలు వల్లే జీఎస్టీపై వినియోగదారులు ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదన్నారు. శనివారం ఒక కార్యక్రమంలో జైట్లీ ప్రసంగిస్తూ.. పన్ను చెల్లించకపోవడాన్ని ప్రాథమిక హక్కుగా ఈ దేశంలో ఎవరూ పేర్కొనలేరని చెప్పారు. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వ్యవస్థకు దేశం రూపాంతరం చెందాలంటే మన ఆలోచనా తీరు, విధానం మారాల’న్నారు.
ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో సాయపడ్డాయని పేర్కొన్నారు. ఒకటి లేదా రెండంచెల పన్ను విధానం అమలు చేయాలన్న విజ్ఞప్తుల్ని జైట్లీ తిరస్కరిస్తూ.. భవిష్యత్తులో చేసే అవకాశముందని, 12, 18 శాతం పన్నుల్ని ఒకే కేటగిరిలోకి తేవచ్చని చెప్పారు. జీఎస్టీ సమష్టి నిర్ణయమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి మద్దతిచ్చాయని చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్స్ వ్యవస్థ వల్లే రాజకీయాల్లో అవినీతి కొనసాగుతోందని జైట్లీ అభిప్రాయపడ్డారు. పార్టీలకు ఎన్నికల నిధుల విషయంలో పారదర్శక విధానం లేదని, ఆ దిశగా సంస్కరణలు చేపట్టడం దేశం ముందున్న పెద్ద సవాలన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై స్పష్టమైన విధానం రూపొందిస్తామని, పన్ను చెల్లించిన డబ్బే రాజకీయ వ్యవస్థలోకి వచ్చేలా చర్యలు చేపడతామని జైట్లీ చెప్పారు.