రాహుల్‌కు కోర్టు సమన్లు
చండీగఢ్: చండీగఢ్‌లోని స్థానిక కోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మంగళవారం సమన్లు జారీ చేసింది. రెండేళ్ల కిందట బీహార్, ఉత్తరప్రదేశ్‌వాసులను కించపరిచేలా ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారని స్థానిక న్యాయవాది దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో 2011 నవంబర్ 14న ఎన్నికల ర్యాలీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్‌కు వచ్చిన రాహుల్.. పంజాబ్, ఢిల్లీలో పనికోసం ఇంకా ఎంతకాలం వెళ్తారు... మహారాష్ట్రలో పనికావాలని ఎందుకు అడుక్కుంటారంటూ ఉత్తరప్రదేశ్, బీహార్ వాసులను కించపరిచేలా మాట్లాడారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జస్విందర్‌సింగ్ సెప్టెంబర్ 19 లోపు కోర్టుకు హాజరుకావాలంటూ రాహుల్‌కు సమన్లు జారీచేశారు.