న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార ఘటన కేసులో నేడు తుది తీర్పు వెలువడనున్న విషయం తెలిసిందే. అయితే తీర్పులో తప్పులు దొర్లాయని జడ్జి యోగేష్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు గంటల పాటు తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో నలుగురు నిందితులపై తుది తీర్పు రానుంది. బస్సు క్లీనర్ అక్షయ్ కుమార్, జిమ్ ఇనస్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్ల వర్తకుడు పవన్‌గుప్తా, ముఖేష్ సింగ్‌పై ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పనుంది. వీరిపై సామూహిక అత్యాచారం, హత్య, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
ఈ సెక్షన్ల కింద గరిష్టంగా మరణదండన శిక్ష విధించే అవకాశం ఉంది. నిందితుడు బస్సుడ్రైవర్ రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా.. బాలనేరస్తుడికి జువైనల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2012 డిసెంబర్ 16న గ్యాంగ్ రేప్ ఘటన జరిగింది. డిసెంబర్ 29న బాధితురాలు మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉద్యమించారు. ఫలితంగా 2013 ఏప్రిల్ 2న నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది.
అయితే నిర్భయ కేసు నిందితుల తల్లిదండ్రులు మాత్రం, తమ పిల్లలు ఏ తప్పూ చేయట్లేదంటున్నారు. అనవసరంగా తమ వారిని ఈ కేసులో ఇరికిస్తున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు నిర్భయ కేసులో నిందితులకు కచ్చితంగా ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.