delhi Gang Rape Case
-
నిర్భయకు మద్దతుగా గొంతెత్తిన భారతం
‘‘ఒక సంఘటన భారతదేశం మొత్తాన్ని కదిలించింది. యువతరాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది. భారతీయులందరూ న్యాయం కావాలని ఎలుగెత్తేలా చేసింది. లాఠీ దెబ్బలు.. జల ఫిరంగులు.. రబ్బరు బుల్లెట్లు.. అరెస్టులు.. వేటినీ లెక్క చేయకుండా నవతరం కదం తొక్కేలా చేసింది. పోలీసు పహారాను చీల్చుకుంటూ నిరసన జ్వాలలు ఎగసిపడేలా చేసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతి ఒక్కరిదీ ఒకటే నినాదం.. నిర్భయకు న్యాయం కావాలి’’ దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సాక్షాత్కరించిన దృశ్యాలివీ. ఎటువంటి జెండా.. ఎజెండా లేకుండా యువతరం, విద్యార్థి లోకం సాగించిన పోరాటానికి యూపీఏ ప్రభుత్వం గజగజలాడింది. చివరికీ ప్రభుత్వమే వారి ముందు మోకరిల్లే పరిస్థితి వచ్చింది. ఆందోళనలు ఇండియాగేట్: చినుకు.. చినుకు.. కలిసి మహాసంద్రమైనట్టు.. నిర్భయకు న్యాయం జరగాలని చిన్నగా మొదలైన ఆందోళనలు.. ఉప్పెనలా ఎగసిపడ్డాయి. 2012 డిసెంబర్ 17న మొదలైన ఆందోళనలు రెండు నెలలకుపైగా నిరంతరాయంగా కొనసాగాయి. దేశ నలుమూలలా ఆందోళనలు.. ర్యాలీలు ఒక ఎత్తయితే.. ఢిల్లీ వేదికగా జరిగిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. ఈ ఉద్యమానికి యువతే మార్గనిర్దేశనం చేయడం మరో విశేషం. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. ఇది అందరూ చెప్పే మాటే అయినా.. నిర్భయ ఉదంతం ఈ మాటను మరోసారి నిజం చేసింది. ఇండియా గేట్ వద్ద ఆందోళనలు ఎగసిపడిన తీరు యూపీఏ ప్రభుత్వానికే ముచ్చెమటలు పట్టించింది. న్యాయం కావాలన్న రణనినాదం పాలకుల చెవుల్లో గింగిరాలు తిరిగింది. వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన యువతీయువకులు ఇండియాగేట్‌పై దండెత్తారు. పిడికిళ్లు బిగించి నిర్భయ కోసం గళమెత్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించింది ఈ సమయంలోనే. ఎప్పుడూ నిర్మానుష్యంగా కనిపించే రైసినా హిల్స్ జనసంద్రమైంది కూడా ఇప్పుడే. దిగివచ్చిన ప్రభుత్వం ప్రపంచానికి ఏం జరిగినా.. ఎటువంటి ఘటన జరిగినా యువత తమకెందుకులే అని వదిలేయదని నిర్భయ ఉదంతం చాటిచెప్పింది. భరతమాత ముద్దుబిడ్డ కోసం ప్రభుత్వాన్నైనా లెక్కచేయం అని ఎలుగెత్తిన యువతరం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందంటే ఆతిశయోక్తి కాదు. నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు ప్రభుత్వాన్ని పడగొట్టినంత పని చేశాయి. న్యాయం కోసం గొంతెత్తి.. పాలకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాయి. అందుకే యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సైతం యువతరానికి సలాం అనాల్సి వచ్చింది. బడాబడా రాజకీయ నాయకులకే అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా.. ఈ ఆందోళనకారులను పిలిచి మరీ మాట్లాడారంటే.. వారి ఆందోళనల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మన్మోహన్.. ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ఇలా నేతలందరి ఇళ్లను ముట్టడించి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఫలితంగా మహిళలకు రక్షణ కల్పించేలా నిర్భయ చట్టం రూపుదాల్చుకుంది. అత్యాచారానికి సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో నిందితులకు మరణశిక్ష విధించేలా ఈ చట్టం రూపొందింది. -
మాకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లిదండ్రులు
నలుగురు క్రూరులకు కోర్టు మరణ దండన విధించడం ‘నిర్భయ’ తల్లిదండ్రులకు సంతృప్తిని, పూర్తి ఉపశమనాన్ని కలిగించింది. ‘నేను ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. ఎట్టకేలకు మాకు ప్రశాంతత చేకూరింది. మా కుమార్తెకు న్యాయం జరిగింది’ అని ‘నిర్భయ’ తల్లి చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల తర్వాత కోర్టు ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘మాది చాలా సంక్లిష్టమైన ప్రయాణం. తీర్పు ఇప్పుడు వెలువడింది. నిజమైన అర్థంలో మాకు న్యాయం చేకూరింది. తీర్పుతో మేం సంతోషంగా ఉన్నాం. ఒకవేళ హైకోర్టులో వాళ్లు అప్పీలు చేసినా, అప్పుడు కూడా మాకు న్యాయమే జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని ఆమె అన్నారు. నిర్భయ తండ్రి మాట్లాడుతూ... ‘ఇటువంటి దారుణాలు మళ్లీ జరగకుండా ఈ తీర్పు నిలువరిస్తుంది. అకృత్యాలు చేయడానికి ఇక ముందు ఎవరూ ధైర్యం చేయరని నాకు అనిపిస్తోంది. దేశంలో న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని అన్నారు. నిర్భయ పూర్వీకుల ఊరిలో సంబరాలు బల్లియా(యూపీ): ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించినట్లు తెలియటంతో నిర్భయ పూర్వీకుల స్వగ్రామంలో సంతోషం వెల్లివిరిసింది. గ్రామస్థులు దేవాలయంలో కొవ్వొత్తులు వెలిగించి నిర్భయకు నివాళులర్పించారు. గ్రామ దేవతకు పూజలు చేశారు. ఊరంతా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 16వ తేదీన నిర్భయపై కిరాతకుల లైంగిక దాడి అనంతరం మేదావర్ కలాన్ గ్రామం పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాన్ని భారీ వరదలు ముంచెత్తినా కోర్టు తీర్పు కోసం ఊరంతా వేయికళ్లతో ఎదురు చూసింది. ప్రజలు ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. తీర్పు వార్త టీవీల్లో రాగానే వాయిద్యాల శబ్దాలతో ఊరంతా మార్మోగింది. ఆమె ఆత్మకు శాంతి: నిర్భయ స్నేహితుడు న్యూఢిల్లీ: నిర్భయ తీర్పుపై ఆమె స్నేహితుడు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె ఆత్మకు శాం తి చేకూరిందని వ్యాఖ్యానించారు. ‘ఇది దేశం సాధించిన విజయం. కోర్టు నిర్ణయం నాకు ఆనం దం కలిగించింది. దోషులు పై కోర్టులకు వెళ్తే అక్కడ కూడా నా పోరాటం సాగిస్తా’’ అని ఆయన చెప్పారు. డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ అత్యాచారానికి గురైన సమయంలో ఆమెతోపాటు ఈయన కూడా బస్సులో ఉన్న సంగతి తెలిసిందే. మౌనం దాల్చిన మైనర్ న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం కేసులో తోటి దోషులకు మరణశిక్ష పడిందన్న విషయం తెలియగానే ఇదే కేసులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న మైనర్ మౌనం దాల్చాడు. ఏమీ మాట్లాడకుండా ముభావంగా కనిపించాడని జువైనల్ హోం (నేరారోపిత బాలల శిక్షణాలయం) సిబ్బంది చెప్పారు. ‘తీర్పు వెలువడిన గంట తర్వాత అతడికి విషయం చెప్పాం. ఈరోజు కోర్టు వారికి శిక్ష విధిస్తుందన్న సంగతి అతడికి తెలుసు. అయినా దాన్ని తెలుసుకునేందుకు ఎలాంటి ఉత్సుకత చూపలేదు. అతడికిచ్చిన ఆహారం తిని, మౌనంగా ఉండిపోయాడు’ అని వివరించారు. నేరం జరిగే సమయానికి ఇతడి వయసు 18ఏళ్లు నిండటానికి ఆరు నెలలు తక్కువగా ఉంది. దీంతో జువైనల్ జస్టిస్ బోర్డు అతడిని మైనర్‌గా భావించి, మూడేళ్లు మాత్రమే శిక్ష విధించింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న జువైనల్ హోంలో ఉన్నాడు. నిర్భయపై అత్యాచారం సమయంలో ఇతడే అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు తోటి నిందితులు పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. న్యాయం చేకూరింది: షిండే ముంబై: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు కోర్టు మరణశిక్ష విధించడాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్వాగతించారు. కోర్టు తీర్పును ఆదర్శనీయమని పేర్కొన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేకూరిందని శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయ దేవత ఓ కొత్త ఒరవడిని సృష్టించిందన్నారు. ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదనే విషయం రుజువైందని చెప్పారు. డిసెంబర్ 16 నాటి ఘటన అనంతరం దేశంలో నెలకొన్న వాతావరణం నేపథ్యంలో ఈ శిక్ష ఊహించిందేనని షిండే వ్యాఖ్యానించారు. ఇప్పుడు సంతోషంగా ఉందా ? మీడియాపై వినయ్‌శర్మ తల్లి ఆగ్రహం న్యూఢిల్లీ: ‘‘మమ్ముల్ని ఇలా వదిలేయండి.. మా కొడుకు తొందర్లోనే చనిపోతాడు.. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా?’’ అంటూ నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన వినయ్ శర్మ తల్లి మీడియాపై మండిపడ్డారు. వినయ్‌కి మరణదండన విధిస్తూ కోర్టు తీర్పు చెప్పగానే ఆమె సృ్పహ కోల్పోయారు. దక్షిణ ఢిల్లీలోని ఓ చిన్న బస్తీ (రవిదాస్ క్యాంపు)లో ఈమె నివసిస్తున్నారు. కాసేపటికి తేరుకున్న వినయ్ తల్లి అక్కడున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సాకేత్ కోర్టు నిందితులకు శిక్షపై తీర్పు వెలువరిస్తున్న సమయంలో ఈ క్యాంపులో ఉన్నవారంతం టీవీలకు అతుక్కుపోయారు. ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూశారు. ఉరిశిక్ష పడిన వారిలో ఒక్క అక్షయ్ తప్ప మిగతా ముగ్గురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్లు ఈ కాలనీకి చెందిన వారే. తీర్పు రాగానే కాలనీలో నిశ్శబ్దం ఆవరించింది. ‘‘ఈ నలుగురు చాలా చిన్నవాళ్లు. ఉరిశిక్ష వేయాల్సింది కాదు. మారేందుకు వారికి ఒక అవకాశం ఇవ్వాల్సింది..’’ అని క్యాంప్ పెద్దగా వ్యవహరిస్తున్న బిహారీ లాల్ అభిప్రాయపడ్డారు. హైకోర్టుకు వెళ్తాం నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష విధించటానికి మీడియానే కారణమని.. దోషుల్లో ఇద్దరి తల్లిదండ్రులు ఆరోపించారు. తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని వినయ్‌శర్మ, పవన్గుప్తాల కుటుంబాలు తెలిపాయి. -
నిర్భయ కేసులో 17 రోజుల్లోనే చార్జిషీట్
* ఢిల్లీ పోలీసుల కృషి * బస్సులోని అల్యూమినియం రేకు తొలగించి రక్తం, డీఎన్ఏ నమూనాల సేకరణ * దంతాలతో మనుషుల్ని గుర్తించే ఫోరెన్సిక్ పరిజ్ఞానాన్నీ వినియోగించిన వైనం న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఢిల్లీ కోర్టు కేవలం 9 నెలల్లో విచారణ పూర్తిచేసి తీర్పు చెప్పటం విశేషమైతే.. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌చేసిన తర్వాత కేవలం 17 రోజుల్లోనే ఢిల్లీ పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జ్‌షీట్ వేయటం మరో విశేషం. ‘ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయటం చాలా ముఖ్యమైన అడు గు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు చార్జ్‌షీట్ వేయటానికి చట్ట ప్రకారం వెసులుబాటు ఉన్న 90 రోజుల సమయాన్ని తీసుకుంటారు. కానీ.. ఈ కేసు విషయంలో మేం నైతిక బాధ్యతతో, చట్టబద్ధమైన బాధ్యతతో.. సాక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా కోర్టు ముందు ఉంచటానికి రాత్రీపగలూ కృషిచేశాం. 17 రోజుల్లోనే మేం పూర్తి చార్జిషీట్ దాఖలు చేశాం’ అని జాయింట్ పోలీస్ కమిషనర్ వివేక్గోగియా పేర్కొన్నారు. కేసు మొదటి 48 గంటల్లో సాక్ష్యాలు చెరిగిపోకుండా నివారించటానికి తమ దర్యాప్తు బృందం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఈ కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన వివేక్ చెప్పారు. ‘ఏ కేసులోనైనా నిందితులను, నేరం జరిగిన ప్రాంతాన్ని గుర్తిం చటం మొట్టమొదటి సవాలు. మేం నేరం జరిగిన ప్రాంతాన్ని (బస్సు) తొలుత చూసినపుడు.. అది కడిగేసి ఉంది. దాని నుంచి తగినన్ని ఆధారాలు సేకరించగలమా అనే ఆందోళన కలిగింది. కానీ మా బృందం పట్టువదలకుండా చేసిన కృషి ఫలించింది. బస్సు అల్యూమినియం ఫ్లోర్‌ను తొలగించి.. దాని కింద నుంచి రక్తం నమూనాలు, డీఎన్ఏ నమూనాలు సేకరించాం. నేరాన్ని బలపరచే సాక్ష్యాలతో పాటు సమగ్రమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచాం’ అని ఆయన వివరించారు. ‘ఈ కేసులో శాస్త్రీయ దర్యాప్తును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. గోళ్ల సందుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించాం. దంతాలతో కొరికిన గాట్ల నుంచి దంతాల మార్కులను రూపొం దించాం. మనుషుల్ని వారి దంతాల ద్వారా గుర్తించే దంతశాస్త్ర ఫోరెన్సిక్ సైన్స్‌ను ఉపయోగించిన తొలి కేసు ఇదేనని నేను భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఎప్పుడేం జరిగింది..? డిసెంబర్ 16, 2012: దేశ రాజధానిలో 23 ఏళ్ల నిర్భయపై ఆరుగురు కిరాతకుల సామూహిక అత్యాచారం. ప్రైవేటు బస్సులో దారుణానికి పాల్పడి చావుబతుకుల మధ్య ఉన్న యువతిని, ఆమె స్నేహితుడిని నడిరోడ్డుపై వదిలేసి పరార్. యువతిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చిన ఆమె స్నేహితుడు. 17: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు. నలుగురు నిందితులు రాంసింగ్ (బస్సు డ్రైవర్), అతడి సోదరుడు ముకేష్, వినయ్‌శర్మ, పవన్ గుప్తాలను గుర్తించిన పోలీసులు. 18: రాంసింగ్‌తోపాటు మిగతా ముగ్గురి అరెస్టు. 21: గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడినవారిలో మైనర్ అరెస్టు. ఆరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ కోసం బీహార్, హర్యానాలో ముమ్మర గాలింపు. 21, 22: బీహార్‌లో ఠాకూర్ అరెస్టు. ఆసుపత్రిలో మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం. 23: దేశ రాజధానిలో మిన్నంటిన ఆందోళనలు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్లెక్కిన ప్రజలు. ఆందోళనకారుల చేతిలో గాయాలపాలైన కానిస్టేబుల్ సుభాష్ టొమార్. 25: బాధితురాలి పరిస్థితి విషమం. కానిస్టేబుల్ సుభాష్ మృతి. 26: మెరుగైన చికిత్స కోసం నిర్భయను సింగపూర్‌కు తరలించిన ప్రభుత్వం. 29: మృత్యువుతో పోరాడుతూ నిర్భయ కన్నుమూత. జనవరి 2,2013: లైంగిక నేరాల్లో సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిన నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆల్తమస్ కబీర్. 3: ఐదుగురు నిందితులపై హత్య, గ్యాంగ్‌రేప్, కిడ్నాప్ అభియోగాలు 17: ఐదుగురు నిందితులపై విచారణను ప్రారంభించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు. ఫిబ్రవరి 28: మైనర్ నిందితుడిపై అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న జువైనల్ కోర్టు. మార్చి 11: తీహార్ జైల్లో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య. 2: కోర్టు విచారణకు సంబంధించిన వార్తల రిపోర్టింగ్‌కు జాతీయ మీడియాకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టు. జూలై 5: కేసులో మైనర్‌పై విచారణను ముగించిన జువైనల్ కోర్టు. 11: కేసులో మైనర్ నేరాన్ని ధ్రువీకరించిన న్యాయస్థానం. ఆగస్టు 22: నలుగురు నిందితులపై తుది వాదనలు విన్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు. 31: మైనర్ నేరాన్ని ధ్రువీకరించి మూడేళ్ల శిక్ష విధించిన కోర్టు. సెప్టెంబర్ 3: కేసులో విచారణను ముగించి తీర్పును వాయిదా వేసిన కోర్టు. 10: ముకేష్, వినయ్, అక్షయ్, పవన్‌లను 13 నేరాలకు సంబంధించి దోషులుగా గుర్తిస్తూ కోర్టు తీర్పు. 11: శిక్ష ఖరారును వాయిదా వేసిన న్యాయస్థానం. 13: నలుగురు దోషులకు మరణ శిక్ష విధించిన కోర్టు. -
మానవ మృగాలకు మరణశాసనం
* నిర్భయ కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు * ఒక నిస్సహాయురాలిపై ఒళ్లు గగుర్పొడిచే రీతిలో పాశవిక నేరానికి పాల్పడ్డారు * బాధితురాలిని పెట్టిన చిత్రహింసలు అసాధారణం.. ఆటవికంగా ప్రవర్తించారు * మానవులు క్షమించడానికి అర్హం కాని తీవ్రమైన మానసిక వికృతత్వాన్ని ప్రదర్శించారు * మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన హెచ్చరిక పంపాల్సిన అవసరముంది * దోషులు నలుగురినీ చనిపోయే వరకూ ఉరితీయాలని కోర్టు తీర్పు * హత్యానేరానికి మరణశిక్ష.. సామూహిక అత్యాచారానికి జీవితఖైదు న్యూఢిల్లీ: నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైన శిక్ష అని న్యాయస్థానం తీర్పుచెప్పింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20)లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. గత డిసెంబర్లో ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా, ఒళ్లు గగుర్పొడిచే రీతిలో వీరు నేరానికి పాల్పడటం.. ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది. ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా తన 20 పేజీల తీర్పులో స్పష్టంచేశారు. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆరో నిందితుడైన బాల నేరస్తుడికి కొద్ది రోజుల కిందట బాలనేరస్తుల న్యాయ బోర్డు మూడేళ్ల శిక్ష విధించటం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసిన బాధితురాలి కుటుంబం.. ఇదే కేసులో మిగతా నలుగురు దోషులకూ మరణశిక్ష విధించడంపై హర్షం వ్యక్తంచేసింది. ‘‘మేం ఊపిరి బిగబట్టి ఎదురుచూశాం.. ఇప్పుడు ఉపశమనం కలిగింది. దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు’’ అని బాధితురాలి తల్లి స్పందించారు. నిర్భయ కేసులో కోర్టు తీర్పు సారాంశమిదీ... ‘‘ఈ ఘటన తీవ్రత.. ఒళ్లు గగుర్పొడిచే పాశవిక, అసాధారణ ప్రవర్తనను వివరిస్తోంది. బాధితురాలిని ఆమె మరణించటానికి ముందు అమానవీయమైన చిత్రహింసలకు గురిచేయటం ఉమ్మడి అంతరాత్మను దిగ్భ్రాంతికి గురిచేయటమే కాదు.. దోషుల చుట్టూ ఉన్న సమాజ రక్షణ హస్తాన్ని ఉపసంహరించాలని చెప్తోంది. దోషుల భయానక చర్య ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా స్పష్టంచేస్తోంది. దోషులు తమ కుట్రలో భాగంగా బాధితులను ప్రలోభపెట్టి బస్సులోకి ఎక్కించారు. బాధితురాలిపై కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అమానవీయమైన చిత్రహింసలకు గురిచేశారు. నిస్సహాయులైన బాధితులు నగ్నంగా ఉన్నస్థితిలో, తీవ్ర రక్తస్రావం అవుతుండగా ఎముకలు కొరికే చలి రాత్రిలో కదులుతున్న బస్సులో నుంచి నగ్నంగా బయటకు విసిరేశారు. వీరి నేరం వారి అసాధారణమైన మానసిక నైతిక పతనాన్ని వివరిస్తోంది. ఆమె పేగులు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితురాలిని గురిచేసిన బాధలు అసాధారణమైనవి. ఆమె అంతర్గత అవయవాలపై ఎంత క్రూరత్వం చూపారో వైద్య రికార్డుల సాక్ష్యాలను బట్టి స్పష్టమవుతోంది. పదే పదే ఇనుపచువ్వలు, చేతులు పెట్టటం వల్ల బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైందని, ముక్కలుగా తెగిపోయిందని వాస్తవాలు చూపుతున్నాయి. దోషులు అత్యంత ఆటవికంగా వారి వట్టి చేతులతో, ఇనుపచువ్వలతో ఆమె శరీరంలోపలి అవయవాలను బయటకు లాగివేశారు. ఆమెకు నయంచేయలేని గాయాలు చేశారు. తద్వా రా మానవ క్షమకు అర్హం కాని తీవ్రమైన మానసిక వికృతత్వాన్ని ప్రదర్శించారు. ఇది నిజానికి దోషుల పాశవిక ప్రవర్తనను చూపుతోంది. దోషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత, ఆమె అంతర్గత అవయవాలను బయటకు లాగివేయటంతో ఆగలేదు. బాధితులను బస్సు వెనుక తలుపు దగ్గరకు ఈడ్చుకెళ్లారు. ఆ తలుపు తెరుచుకోకపోవటంతో బాధితులను జట్టుపట్టుకుని బస్సు ముందలి తలుపు దగ్గరకు ఈడ్చుకెళ్లి కదులుతున్న బస్సు నుంచి విసిరేశారు. కాబట్టి దోషుల చర్యకు అత్యంత తీవ్రమైన శిక్ష అవసరమని ఇది చెప్తోంది. మహిళలపై దారుణ నేరాలు అంతులేకుం డా సాగుతున్న కాలమిది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠినమైన హెచ్చరిక సందేశాన్ని పంపాల్సిన అవసరాన్ని కోర్టులు విస్మరించజాలవు. మహిళలపై ఎలాంటి నేరానికి పాల్పడ్డా సహించేది లేదని సమాజం అవగతం చేసుకున్నపుడు మాత్రమే మహిళలపై నేరాల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుంది. కాబట్టి నేర న్యాయ వ్యవస్థ ప్రజల మనసుల్లో, ప్రత్యేకించి మహిళల్లో విశ్వాసాన్ని నింపి తీరాలి.’’ అత్యంత అరుదైన కేసే..! తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యలు న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు మృత్యు దండన విధిస్తూ తీర్పు వెలువరించిన సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా పలు వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు కిందకే వస్తుందని పేర్కొన్నారు. పశువుల్లా ప్రవర్తించిన దోషుల తీరు రోమాలు నిక్కబొడుచుకునే ఈ సంఘటన తీవ్రతకు అద్దంపడుతోందన్నారు. బాధితురాలి పట్ల దోషుల అమానవీయ ప్రవర్తన అందరినీ కలచివేసిందన్నారు. దోషుల భయంకరమైన ప్రవర్తన ఈ కేసును కచ్చితంగా అరుదైన కేసుల కోవలోకి చేర్చిందన్నారు. దోషులను సమాజం ఛీదరించుకోవటం, తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం తదితర అంశాలను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. దోషులు వీరే.. 1. రామ్‌సింగ్ (34) (ప్రధాన దోషి. తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు). బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2. అక్షయ్ ఠాకూర్ (28). ఉపాధి కోసం ఢిల్లీ వచ్చాడు. 3. వినయ్ శర్మ (20). అసిస్టెంట్ జిమ్ ఇన్స్ట్రక్టర్ 4. ముకేశ్‌సింగ్ (26). రామ్‌సింగ్ సోదరుడు. దక్షిణ ఢిల్లీలో వుురికివాడలో సోదరుడితో కలిసి జీవించాడు. 5. పవన్ గుప్తా (19). పండ్ల వ్యాపారి. ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), 376(2)(జీ) (సామూహిక అత్యాచారం) కింద కోర్టు వీరిని దోషులుగా ప్రకటించింది. దోషులకు తెల్ల దుస్తులు న్యూఢిల్లీ: నిర్భయ కేసులో మరణ శిక్ష పడిన నలుగురు దోషులకు తీహార్ జైలు సంప్రదా యం ప్రకారం అధికారులు తెల్ల దుస్తులు అందజేశారు. దీంతో జైల్లో ఇప్పటిదాకా విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని ఇకపై దోషులుగా గుర్తిస్తారు. పవన్ గుప్తా(19), వినయ్‌శర్మ(20)లను ఏడో నెంబరు జైల్లో ఉంచగా, ముకేష్(26), అక్షయ్ ఠాకూర్(28)లను నాలుగో నెంబరు జైల్లో ఉంచారు. -
ఆ నలుగురిని బహిరంగంగా ఊరి తీయాలి: టీడీపీ
నిర్భయ కేసులో ఉరిశిక్ష ఖరారైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. బాధితురాలి పట్ల రాక్షసంగా ప్రవర్తించిన అరుదైన నిర్భయ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్భయ చట్టం అమలు సరిగాలేదని తప్పుపట్టారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ రోజురోజుకూ మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న పరిస్థితులలో నిర్భయ చట్టం వచ్చిందని, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో మహిళలపై దాడులు పెరిగిపోవడం దారుణమన్నారు. నిర్భయ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో వెంటనే తీర్పు వచ్చి ఉన్నట్టయితే పరిస్థితులు వేరుగా ఉండేవని అభిప్రాయపడ్డారు. తీర్పు ఆలస్యమైన నేపథ్యంలోనే ముంబయిలో మహిళా ఫోటోగ్రాపర్పై లైంగిక దాడి చోటుచేసుకుందన్నారు. మన రాష్ట్రంలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఆరేళ్ల బాలికపై, విశాఖపట్నం జైలు వద్ద మహిళప ఇద్దరు కానిస్టేబుల్స్ లైంగిక దాడి చేయడం లాంటి ఘటనలు కొంత వరకు తగ్గేవన్నారు. నిర్భయ కేసు నిందితులలో మైనర్ అన్న కారణంగా ఒకరికి కేవలం మూడేళ్లే శిక్ష విధించడం దారుణమన్నారు. అతనికీ ఖచ్చితంగా నలుగురి నిందితులతో పాటు తీవ్రమైన శిక్ష విధించాలని సూచించారు. -
నిర్భయ కేసులో మధ్యాహ్నం కోర్టు తీర్పు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో దోషుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు వారికి శిక్షలు ఖరారు చేయనుంది. శిక్షలు ఏవిధంగా ఉంటాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దోషులకు మరణశిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులతో పాటు దేశవ్యాప్తంగా పలు విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దోషులకు మరణశిక్ష పడే అవకాశాలే అధికంగా ఉన్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా సాకేత్ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు మార్గంలో రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్దేశపూర్వకంగానే 23ఏళ్ల నిస్సహాయ మెడికోపై ఈ నలుగురు అత్యాచారానికి పాల్పడి ఆమెను హతమార్చారని అదనపు సెషన్స్ న్యాయమూర్తి యోగేష్ ఖన్నా తన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీరిని హత్యానేరం కింద కూడా దోషులుగా నిర్థారించడం వల్ల కనిష్ఠ స్థాయిలో యావజ్జీవ కారాగార శిక్ష, గరిష్ఠ స్థాయిలో మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. తమకు క్షమాభిక్ష పెట్టాలని దోషులు వేడుకుంటున్నప్పటికీ వారి పట్ల ఎలాంటి సానుభూతి కనబరచాల్సిన అవసరం లేదని, వారికి ఉరిశిక్ష వేయాల్సిందేనని ఢిల్లీ పోలీసులు కూడా డిమాండ్ చేశారు. -
నిర్భయ దోషులకు నేడు శిక్ష!
-
నిర్భయ దోషులకు నేడు శిక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిర్భయ కేసులో దోషుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మధ్యాహ్నం వారికి శిక్షలు ఖరారు చేయనుంది. శిక్షలు ఏవిధంగా ఉంటాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దోషులకు మరణశిక్ష విధించాలని నిర్భ య తల్లిదండ్రులతో పాటు దేశవ్యాప్తంగా పలు విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దోషులకు మరణశిక్ష పడే అవకాశాలే అధికంగా ఉన్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హత్య కేసులలో అత్యంత అరుదైన కేసుల్లోనే దోషులకు మరణశిక్ష పడుతుందని అం టున్నారు. చిన్నారులు, నిస్సహాయులైన మహిళలు, బలహీనులైన వ్యక్తులు లేదా వృద్ధులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన దోషులకు కోర్టు సాధారణంగా మరణశిక్ష విధిస్తుందని, ఇలాంటివే అత్యంత అరుదైన కేసుల కోవలోకి వస్తాయని పేర్కొం టున్నారు. 1955 వరకు హత్య కేసులన్నిటిలో దోషులకు మరణశిక్షే విధించేవారు. ఒకవేళ జీవితఖైదు విధించినట్లయితే న్యాయమూర్తి అందుకు కారణాలను వివరించేవారు. కానీ 1955లో చట్ట సవరణ ద్వారా హత్య కేసులలో దోషులకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించే విచక్షణాధికారాన్ని జడ్జీలకే వదిలేశారు. అయితే 1973లో భారతీయ శిక్షా స్మృతిని సవరించి దోషులకు మరణశిక్ష విధించినట్లయితే ఆ నిర్ణయానికి గల కారణాలను తీర్పు సందర్భంగా వివరించాలనే నిబంధన చేర్చారు. -
నిర్భయ కేసు తీర్పులో తప్పులు, వాయిదా పడ్డ తీర్పు
న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార ఘటన కేసులో నేడు తుది తీర్పు వెలువడనున్న విషయం తెలిసిందే. అయితే తీర్పులో తప్పులు దొర్లాయని జడ్జి యోగేష్ ఖన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు గంటల పాటు తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో నలుగురు నిందితులపై తుది తీర్పు రానుంది. బస్సు క్లీనర్ అక్షయ్ కుమార్, జిమ్ ఇనస్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్ల వర్తకుడు పవన్‌గుప్తా, ముఖేష్ సింగ్‌పై ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పనుంది. వీరిపై సామూహిక అత్యాచారం, హత్య, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ సెక్షన్ల కింద గరిష్టంగా మరణదండన శిక్ష విధించే అవకాశం ఉంది. నిందితుడు బస్సుడ్రైవర్ రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా.. బాలనేరస్తుడికి జువైనల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2012 డిసెంబర్ 16న గ్యాంగ్ రేప్ ఘటన జరిగింది. డిసెంబర్ 29న బాధితురాలు మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉద్యమించారు. ఫలితంగా 2013 ఏప్రిల్ 2న నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ కేసు నిందితుల తల్లిదండ్రులు మాత్రం, తమ పిల్లలు ఏ తప్పూ చేయట్లేదంటున్నారు. అనవసరంగా తమ వారిని ఈ కేసులో ఇరికిస్తున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు నిర్భయ కేసులో నిందితులకు కచ్చితంగా ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.