* ఢిల్లీ పోలీసుల కృషి
* బస్సులోని అల్యూమినియం రేకు తొలగించి రక్తం, డీఎన్‌ఏ నమూనాల సేకరణ
* దంతాలతో మనుషుల్ని గుర్తించే ఫోరెన్సిక్ పరిజ్ఞానాన్నీ వినియోగించిన వైనం
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఢిల్లీ కోర్టు కేవలం 9 నెలల్లో విచారణ పూర్తిచేసి తీర్పు చెప్పటం విశేషమైతే.. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌చేసిన తర్వాత కేవలం 17 రోజుల్లోనే ఢిల్లీ పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జ్‌షీట్ వేయటం మరో విశేషం. ‘ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయటం చాలా ముఖ్యమైన అడు గు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు చార్జ్‌షీట్ వేయటానికి చట్ట ప్రకారం వెసులుబాటు ఉన్న 90 రోజుల సమయాన్ని తీసుకుంటారు. కానీ.. ఈ కేసు విషయంలో మేం నైతిక బాధ్యతతో, చట్టబద్ధమైన బాధ్యతతో.. సాక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా కోర్టు ముందు ఉంచటానికి రాత్రీపగలూ కృషిచేశాం. 17 రోజుల్లోనే మేం పూర్తి చార్జిషీట్ దాఖలు చేశాం’ అని జాయింట్ పోలీస్ కమిషనర్ వివేక్‌గోగియా పేర్కొన్నారు.
కేసు మొదటి 48 గంటల్లో సాక్ష్యాలు చెరిగిపోకుండా నివారించటానికి తమ దర్యాప్తు బృందం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఈ కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన వివేక్ చెప్పారు. ‘ఏ కేసులోనైనా నిందితులను, నేరం జరిగిన ప్రాంతాన్ని గుర్తిం చటం మొట్టమొదటి సవాలు. మేం నేరం జరిగిన ప్రాంతాన్ని (బస్సు) తొలుత చూసినపుడు.. అది కడిగేసి ఉంది. దాని నుంచి తగినన్ని ఆధారాలు సేకరించగలమా అనే ఆందోళన కలిగింది. కానీ మా బృందం పట్టువదలకుండా చేసిన కృషి ఫలించింది. బస్సు అల్యూమినియం ఫ్లోర్‌ను తొలగించి.. దాని కింద నుంచి రక్తం నమూనాలు, డీఎన్‌ఏ నమూనాలు సేకరించాం. నేరాన్ని బలపరచే సాక్ష్యాలతో పాటు సమగ్రమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచాం’ అని ఆయన వివరించారు.
‘ఈ కేసులో శాస్త్రీయ దర్యాప్తును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. గోళ్ల సందుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించాం. దంతాలతో కొరికిన గాట్ల నుంచి దంతాల మార్కులను రూపొం దించాం. మనుషుల్ని వారి దంతాల ద్వారా గుర్తించే దంతశాస్త్ర ఫోరెన్సిక్ సైన్స్‌ను ఉపయోగించిన తొలి కేసు ఇదేనని నేను భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.
ఎప్పుడేం జరిగింది..?
డిసెంబర్ 16, 2012: దేశ రాజధానిలో 23 ఏళ్ల నిర్భయపై ఆరుగురు కిరాతకుల సామూహిక అత్యాచారం. ప్రైవేటు బస్సులో దారుణానికి పాల్పడి చావుబతుకుల మధ్య ఉన్న యువతిని, ఆమె స్నేహితుడిని నడిరోడ్డుపై వదిలేసి పరార్. యువతిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చిన ఆమె స్నేహితుడు.
17: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు. నలుగురు నిందితులు రాంసింగ్ (బస్సు డ్రైవర్), అతడి సోదరుడు ముకేష్, వినయ్‌శర్మ, పవన్ గుప్తాలను గుర్తించిన పోలీసులు.
18: రాంసింగ్‌తోపాటు మిగతా ముగ్గురి అరెస్టు.
21: గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడినవారిలో మైనర్ అరెస్టు. ఆరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ కోసం బీహార్, హర్యానాలో ముమ్మర గాలింపు.
21, 22: బీహార్‌లో ఠాకూర్ అరెస్టు. ఆసుపత్రిలో మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం.
23: దేశ రాజధానిలో మిన్నంటిన ఆందోళనలు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్లెక్కిన ప్రజలు. ఆందోళనకారుల చేతిలో గాయాలపాలైన కానిస్టేబుల్ సుభాష్ టొమార్.
25: బాధితురాలి పరిస్థితి విషమం. కానిస్టేబుల్ సుభాష్ మృతి.
26: మెరుగైన చికిత్స కోసం నిర్భయను సింగపూర్‌కు తరలించిన ప్రభుత్వం.
29: మృత్యువుతో పోరాడుతూ నిర్భయ కన్నుమూత.
జనవరి 2,2013: లైంగిక నేరాల్లో సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిన నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆల్తమస్ కబీర్.
3: ఐదుగురు నిందితులపై హత్య, గ్యాంగ్‌రేప్, కిడ్నాప్ అభియోగాలు
17: ఐదుగురు నిందితులపై విచారణను ప్రారంభించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.
ఫిబ్రవరి 28: మైనర్ నిందితుడిపై అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న జువైనల్ కోర్టు.
మార్చి 11: తీహార్ జైల్లో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య.
2: కోర్టు విచారణకు సంబంధించిన వార్తల రిపోర్టింగ్‌కు జాతీయ మీడియాకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టు.
జూలై 5: కేసులో మైనర్‌పై విచారణను ముగించిన జువైనల్ కోర్టు.
11: కేసులో మైనర్ నేరాన్ని ధ్రువీకరించిన న్యాయస్థానం.
ఆగస్టు 22: నలుగురు నిందితులపై తుది వాదనలు విన్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.
31: మైనర్ నేరాన్ని ధ్రువీకరించి మూడేళ్ల శిక్ష విధించిన కోర్టు.
సెప్టెంబర్ 3: కేసులో విచారణను ముగించి తీర్పును వాయిదా వేసిన కోర్టు.
10: ముకేష్, వినయ్, అక్షయ్, పవన్‌లను 13 నేరాలకు సంబంధించి దోషులుగా గుర్తిస్తూ కోర్టు తీర్పు.
11: శిక్ష ఖరారును వాయిదా వేసిన న్యాయస్థానం.
13: నలుగురు దోషులకు మరణ శిక్ష విధించిన కోర్టు.