మాకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లిదండ్రులు
నలుగురు క్రూరులకు కోర్టు మరణ దండన విధించడం ‘నిర్భయ’ తల్లిదండ్రులకు సంతృప్తిని, పూర్తి ఉపశమనాన్ని కలిగించింది. ‘నేను ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. ఎట్టకేలకు మాకు ప్రశాంతత చేకూరింది. మా కుమార్తెకు న్యాయం జరిగింది’ అని ‘నిర్భయ’ తల్లి చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల తర్వాత కోర్టు ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
‘మాది చాలా సంక్లిష్టమైన ప్రయాణం. తీర్పు ఇప్పుడు వెలువడింది. నిజమైన అర్థంలో మాకు న్యాయం చేకూరింది. తీర్పుతో మేం సంతోషంగా ఉన్నాం. ఒకవేళ హైకోర్టులో వాళ్లు అప్పీలు చేసినా, అప్పుడు కూడా మాకు న్యాయమే జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని ఆమె అన్నారు. నిర్భయ తండ్రి మాట్లాడుతూ... ‘ఇటువంటి దారుణాలు మళ్లీ జరగకుండా ఈ తీర్పు నిలువరిస్తుంది. అకృత్యాలు చేయడానికి ఇక ముందు ఎవరూ ధైర్యం చేయరని నాకు అనిపిస్తోంది. దేశంలో న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని అన్నారు.
నిర్భయ పూర్వీకుల ఊరిలో సంబరాలు
బల్లియా(యూపీ): ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించినట్లు తెలియటంతో నిర్భయ పూర్వీకుల స్వగ్రామంలో సంతోషం వెల్లివిరిసింది. గ్రామస్థులు దేవాలయంలో కొవ్వొత్తులు వెలిగించి నిర్భయకు నివాళులర్పించారు. గ్రామ దేవతకు పూజలు చేశారు. ఊరంతా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 16వ తేదీన నిర్భయపై కిరాతకుల లైంగిక దాడి అనంతరం మేదావర్ కలాన్ గ్రామం పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాన్ని భారీ వరదలు ముంచెత్తినా కోర్టు తీర్పు కోసం ఊరంతా వేయికళ్లతో ఎదురు చూసింది. ప్రజలు ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. తీర్పు వార్త టీవీల్లో రాగానే వాయిద్యాల శబ్దాలతో ఊరంతా మార్మోగింది.
ఆమె ఆత్మకు శాంతి: నిర్భయ స్నేహితుడు
న్యూఢిల్లీ: నిర్భయ తీర్పుపై ఆమె స్నేహితుడు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె ఆత్మకు శాం తి చేకూరిందని వ్యాఖ్యానించారు. ‘ఇది దేశం సాధించిన విజయం. కోర్టు నిర్ణయం నాకు ఆనం దం కలిగించింది. దోషులు పై కోర్టులకు వెళ్తే అక్కడ కూడా నా పోరాటం సాగిస్తా’’ అని ఆయన చెప్పారు. డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ అత్యాచారానికి గురైన సమయంలో ఆమెతోపాటు ఈయన కూడా బస్సులో ఉన్న సంగతి తెలిసిందే.
మౌనం దాల్చిన మైనర్
న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం కేసులో తోటి దోషులకు మరణశిక్ష పడిందన్న విషయం తెలియగానే ఇదే కేసులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న మైనర్ మౌనం దాల్చాడు. ఏమీ మాట్లాడకుండా ముభావంగా కనిపించాడని జువైనల్ హోం (నేరారోపిత బాలల శిక్షణాలయం) సిబ్బంది చెప్పారు. ‘తీర్పు వెలువడిన గంట తర్వాత అతడికి విషయం చెప్పాం. ఈరోజు కోర్టు వారికి శిక్ష విధిస్తుందన్న సంగతి అతడికి తెలుసు. అయినా దాన్ని తెలుసుకునేందుకు ఎలాంటి ఉత్సుకత చూపలేదు. అతడికిచ్చిన ఆహారం తిని, మౌనంగా ఉండిపోయాడు’ అని వివరించారు.
నేరం జరిగే సమయానికి ఇతడి వయసు 18ఏళ్లు నిండటానికి ఆరు నెలలు తక్కువగా ఉంది. దీంతో జువైనల్ జస్టిస్ బోర్డు అతడిని మైనర్‌గా భావించి, మూడేళ్లు మాత్రమే శిక్ష విధించింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న జువైనల్ హోంలో ఉన్నాడు. నిర్భయపై అత్యాచారం సమయంలో ఇతడే అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు తోటి నిందితులు పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే.
న్యాయం చేకూరింది: షిండే
ముంబై: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు కోర్టు మరణశిక్ష విధించడాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్వాగతించారు. కోర్టు తీర్పును ఆదర్శనీయమని పేర్కొన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేకూరిందని శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయ దేవత ఓ కొత్త ఒరవడిని సృష్టించిందన్నారు. ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదనే విషయం రుజువైందని చెప్పారు. డిసెంబర్ 16 నాటి ఘటన అనంతరం దేశంలో నెలకొన్న వాతావరణం నేపథ్యంలో ఈ శిక్ష ఊహించిందేనని షిండే వ్యాఖ్యానించారు.
ఇప్పుడు సంతోషంగా ఉందా ?
మీడియాపై వినయ్‌శర్మ తల్లి ఆగ్రహం
న్యూఢిల్లీ: ‘‘మమ్ముల్ని ఇలా వదిలేయండి.. మా కొడుకు తొందర్లోనే చనిపోతాడు.. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా?’’ అంటూ నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన వినయ్ శర్మ తల్లి మీడియాపై మండిపడ్డారు. వినయ్‌కి మరణదండన విధిస్తూ కోర్టు తీర్పు చెప్పగానే ఆమె సృ్పహ కోల్పోయారు. దక్షిణ ఢిల్లీలోని ఓ చిన్న బస్తీ (రవిదాస్ క్యాంపు)లో ఈమె నివసిస్తున్నారు. కాసేపటికి తేరుకున్న వినయ్ తల్లి అక్కడున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని సాకేత్ కోర్టు నిందితులకు శిక్షపై తీర్పు వెలువరిస్తున్న సమయంలో ఈ క్యాంపులో ఉన్నవారంతం టీవీలకు అతుక్కుపోయారు. ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూశారు. ఉరిశిక్ష పడిన వారిలో ఒక్క అక్షయ్ తప్ప మిగతా ముగ్గురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్‌లు ఈ కాలనీకి చెందిన వారే. తీర్పు రాగానే కాలనీలో నిశ్శబ్దం ఆవరించింది. ‘‘ఈ నలుగురు చాలా చిన్నవాళ్లు. ఉరిశిక్ష వేయాల్సింది కాదు. మారేందుకు వారికి ఒక అవకాశం ఇవ్వాల్సింది..’’ అని క్యాంప్ పెద్దగా వ్యవహరిస్తున్న బిహారీ లాల్ అభిప్రాయపడ్డారు.
హైకోర్టుకు వెళ్తాం
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష విధించటానికి మీడియానే కారణమని.. దోషుల్లో ఇద్దరి తల్లిదండ్రులు ఆరోపించారు. తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని వినయ్‌శర్మ, పవన్‌గుప్తాల కుటుంబాలు తెలిపాయి.