సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం మహిళలకు సురక్షితం కాదని బలంగా పాతుకుపోయిన అభిప్రాయాన్ని మార్చేందుకు ఢిల్లీ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఢిల్లీ నగరం మహిళలకు సురక్షితమైనదేనన్న విషయాన్ని చాటిచెప్పడం కోసం వారు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టనున్నారు. నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసు అనంతరం ఢిల్లీలో పర్యాటక రంగం ప్రభావితమైంది. ప్రతి నిత్యం నగరంలోని ఏదో ఒక మూల రేప్ కేసులు నమోదవుతుండడంతో ఢిల్లీ సురక్షిత నగరం కాదన్న అభిప్రాయం మహిళా పర్యాటకులలో బలపడింది. గూండాలు వీధుల్లో తిరుగుతుంటారని, చీకటిపడిన తరువాత మహిళలు బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదన్న వదంతులు వ్యాపించడంతో రాజధాని నగరంపై దురభిప్రాయం ఏర్పడింది.
అయితే ఇది నిజం కాదని, ఢిల్లీ రోడ్లు మహిళలకు సురక్షితమైనవే అన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని నగర పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న మాట వాస్తవమే. అయితే ఈ అత్యాచారాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా మహిళలకు పరిచయస్తులేనని పోలీసులు అంటున్నారు. అపరి చితుల చేతిలో అత్యాచారాలకు గురైన మహిళల కన్నా పరిచయస్తుల చేతిలో అత్యాచారాలకు గురైన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని పోలీసులు గణాం కాలతో సహా వివరిస్తున్నారు. అందువల్ల నగర రోడ్లపై మహిళలు సురక్షితంగా సంచరించవచ్చని తెలియచెప్పాలని పోలీసులు యోచిస్తున్నారు. రోడ్లపై జరిగే కిడ్నాప్‌లు, వేధింపులను చాలా వరకు అరికట్టగలిగామని వారంటున్నారు.
ఢిల్లీ పోలీసు వెబ్‌సైట్‌లో నేర వివరాల గణాం కాలను ఉంచడంతో పాటు, సోషల్ మీడియా, పోస్టర్లు, హోర్డింగ్‌ల ద్వారా మహిళలపై జరిగిన నేరాల వివరాల గణాంకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఢిల్లీ పోలీసులు యోచిస్తున్నారు. పరిచితులు, అపరిచితుల చేతిలో అత్యాచారానికి గురైన బాధితుల సంఖ్యను వేర్వేరుగా చూపడం ద్వారా నగరాన్ని సందర్శించే మహిళలకు ముప్పేమీ లేదన్న విషయాన్ని తెలియజెప్పాలని ఢిల్లీ పోలీ సులు అనుకుంటున్నారు. గడిచిన రెండు సంవత్సరాల నేరాల వివరాలను పరిశీలిస్తే 2012, 2013 లలో నమోదైన అత్యాచార కేసులలో 97 శాతం పరిచయస్తులపైన నమోదైనవేనని వారు అంటున్నారు. 2012లో 680 రేప్ కేసులు, 2013లో 1,159 రేప్ కేసులు నమోదయ్యాయని వాటిలో 3 శాతం కేసుల్లోనే నిందితులు బాధితులకు అపరిచితులని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. 2014లో మే 31 వరకు ఢిల్లీలోని విభిన్న పోలీస్ స్టేషన్లలో 797 రేప్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 93 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు పరిచయస్తులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది.
మహిళలకు ఢిల్లీ సురక్షితమే
Published Thu, Jun 19 2014 10:32 PM | Last Updated on Wed, Oct 17 2018 5:52 PM
Advertisement