
నిర్భయ కేసులో మధ్యాహ్నం కోర్టు తీర్పు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో దోషుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు వారికి శిక్షలు ఖరారు చేయనుంది. శిక్షలు ఏవిధంగా ఉంటాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
దోషులకు మరణశిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులతో పాటు దేశవ్యాప్తంగా పలు విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దోషులకు మరణశిక్ష పడే అవకాశాలే అధికంగా ఉన్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా సాకేత్ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు మార్గంలో రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఉద్దేశపూర్వకంగానే 23ఏళ్ల నిస్సహాయ మెడికోపై ఈ నలుగురు అత్యాచారానికి పాల్పడి ఆమెను హతమార్చారని అదనపు సెషన్స్ న్యాయమూర్తి యోగేష్ ఖన్నా తన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీరిని హత్యానేరం కింద కూడా దోషులుగా నిర్థారించడం వల్ల కనిష్ఠ స్థాయిలో యావజ్జీవ కారాగార శిక్ష, గరిష్ఠ స్థాయిలో మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. తమకు క్షమాభిక్ష పెట్టాలని దోషులు వేడుకుంటున్నప్పటికీ వారి పట్ల ఎలాంటి సానుభూతి కనబరచాల్సిన అవసరం లేదని, వారికి ఉరిశిక్ష వేయాల్సిందేనని ఢిల్లీ పోలీసులు కూడా డిమాండ్ చేశారు.