న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. లాయర్ దుస్తుల్లో వచ్చిన కామేశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఓ మహిళపై కాల్పులు జరిపి పరారయ్యాడు. దాంతో అంతా పరుగులు తీశారు. మహిళకు ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఆర్థిక విభేదాలే ఘటనకు కారణమని భావిస్తున్నామన్నారు. మాజీ లాయర్ అయిన నిందితుడు హరియాణా పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఏడాది అతడిని ఢిల్లీ బార్ అసోసియేషన్ బహిష్కరించింది.
ఆయన ఎం.రాధ(సుమారు 40 ఏళ్లు) అనే మహిళకు రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తిరిగివ్వకపోవడంతో చీటింగ్ కేసు పెట్టాడు. విచారణకు శుక్రవారం ఇద్దరూ కోర్టుకు వచ్చారు. 10.30 సమయంలో తగవుపడ్డారు. కామేశ్వర్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో రాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. రాధకు రెండు బుల్లెట్లు, పక్కనే ఉన్న లాయర్‌కు ఒక బుల్లెట్ తగిలాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఢిల్లీలో సామాన్యులకు భద్రతే లేకుండా పోతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment