నిర్భయకు మద్దతుగా గొంతెత్తిన భారతం | nation protest for nirbhaya | Sakshi
Sakshi News home page

నిర్భయకు మద్దతుగా గొంతెత్తిన భారతం

Published Sat, Sep 14 2013 6:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

nation protest for nirbhaya

‘‘ఒక సంఘటన భారతదేశం మొత్తాన్ని కదిలించింది. యువతరాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది. భారతీయులందరూ న్యాయం కావాలని ఎలుగెత్తేలా చేసింది. లాఠీ దెబ్బలు.. జల ఫిరంగులు.. రబ్బరు బుల్లెట్లు.. అరెస్టులు.. వేటినీ లెక్క చేయకుండా నవతరం కదం తొక్కేలా చేసింది. పోలీసు పహారాను చీల్చుకుంటూ నిరసన జ్వాలలు ఎగసిపడేలా చేసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతి ఒక్కరిదీ ఒకటే నినాదం.. నిర్భయకు న్యాయం కావాలి’’ దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సాక్షాత్కరించిన దృశ్యాలివీ. ఎటువంటి జెండా.. ఎజెండా లేకుండా యువతరం, విద్యార్థి లోకం సాగించిన పోరాటానికి యూపీఏ ప్రభుత్వం గజగజలాడింది. చివరికీ ప్రభుత్వమే వారి ముందు మోకరిల్లే పరిస్థితి వచ్చింది.
 
ఆందోళనలు
ఇండియాగేట్: చినుకు.. చినుకు.. కలిసి మహాసంద్రమైనట్టు.. నిర్భయకు న్యాయం జరగాలని చిన్నగా మొదలైన ఆందోళనలు.. ఉప్పెనలా ఎగసిపడ్డాయి. 2012 డిసెంబర్ 17న మొదలైన ఆందోళనలు రెండు నెలలకుపైగా నిరంతరాయంగా కొనసాగాయి. దేశ నలుమూలలా ఆందోళనలు.. ర్యాలీలు ఒక ఎత్తయితే.. ఢిల్లీ వేదికగా జరిగిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. ఈ ఉద్యమానికి యువతే మార్గనిర్దేశనం చేయడం మరో విశేషం. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.. ఇది అందరూ చెప్పే మాటే అయినా.. నిర్భయ ఉదంతం ఈ మాటను మరోసారి నిజం చేసింది.

ఇండియా గేట్ వద్ద ఆందోళనలు ఎగసిపడిన తీరు యూపీఏ ప్రభుత్వానికే ముచ్చెమటలు పట్టించింది. న్యాయం కావాలన్న రణనినాదం పాలకుల చెవుల్లో గింగిరాలు తిరిగింది. వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన యువతీయువకులు ఇండియాగేట్‌పై దండెత్తారు. పిడికిళ్లు బిగించి నిర్భయ కోసం గళమెత్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించింది ఈ సమయంలోనే. ఎప్పుడూ నిర్మానుష్యంగా కనిపించే రైసినా హిల్స్ జనసంద్రమైంది కూడా ఇప్పుడే.
 
దిగివచ్చిన ప్రభుత్వం
ప్రపంచానికి ఏం జరిగినా.. ఎటువంటి ఘటన జరిగినా యువత తమకెందుకులే అని వదిలేయదని నిర్భయ ఉదంతం చాటిచెప్పింది. భరతమాత ముద్దుబిడ్డ కోసం ప్రభుత్వాన్నైనా లెక్కచేయం అని ఎలుగెత్తిన యువతరం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందంటే ఆతిశయోక్తి కాదు. నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు ప్రభుత్వాన్ని పడగొట్టినంత పని చేశాయి. న్యాయం కోసం గొంతెత్తి.. పాలకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాయి.

అందుకే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సైతం యువతరానికి సలాం అనాల్సి వచ్చింది. బడాబడా రాజకీయ నాయకులకే అపాయింట్‌మెంట్ ఇవ్వని సోనియా.. ఈ ఆందోళనకారులను పిలిచి మరీ మాట్లాడారంటే.. వారి ఆందోళనల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మన్మోహన్.. ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ఇలా నేతలందరి ఇళ్లను ముట్టడించి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఫలితంగా మహిళలకు రక్షణ కల్పించేలా నిర్భయ చట్టం రూపుదాల్చుకుంది. అత్యాచారానికి సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో నిందితులకు మరణశిక్ష విధించేలా ఈ చట్టం రూపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement