న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2013 డిసెంబర్‌లో 9.87 శాతంగా నమోదయ్యింది. అంటే 2012 డిసెంబర్ ధరలతో పోల్చితే 2013 డిసెంబర్‌లో ధరలు 9.87 శాతం అధికంగా ఉన్నాయన్నమాట. 2013 నవంబర్‌లో ఈ రేటు 11.16 శాతం. నెల వ్యవధిలో ధరల స్పీడ్ 11.16 శాతం నుంచి మూడు నెలల కనిష్ట స్థాయి 9.87 శాతానికి తగ్గినా... సామాన్యునికి ఈ మాత్రం పెరుగుదల సైతం భారమేనని విశ్లేషకులు అభిప్రాయం. ముఖ్యాంశాలు...
- ఆహార, పానీయాల విభాగంలో పెరుగుదల రేటు 12.16%
- ఇంధనం లైట్ ద్రవ్యోల్బణం రేటు 6.89 శాతం
- దుస్తులు, బెడ్డింగ్, పాదరక్షల విషయంలో రేటు 9.25 శాతం
- అన్ని గ్రూపులూ కలిసి మొత్తం సూచీ 9.87 శాతం
- ఒక్క చక్కెర ధర తగ్గడాన్ని (-5.61శాతం) మినహాయిస్తే- మిగిలిన దాదాపు అన్ని ప్రధాన ఆహార ఉత్పత్తుల ధరలన్నీ డిసెంబర్‌లో తీవ్రంగానే ఉన్నాయి.
- కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 2013 డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 10.49 శాతంగా ఉంది. నవంబర్‌లో ఈ రేటు 11.74 శాతం. ఇక పట్టణ పాంతాల్లో ఈ రేటు 10.5 శాతం నుంచి 9.11 శాతానికి తగ్గింది.
- మరోవైపు డిసెంబర్ నెలకు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు మంగళవారం(14న) వెలువడే అవకాశం ఉంది.