న్యూఢిల్లీ: కశ్మీర్‌లో అల్లరిమూకను రెచ్చగొడుతూ.. హింసకు ప్రేరేపిస్తున్న తెరవెనుక సూత్రధారులపై ఉక్కుపాదం మోపాలని భద్రతా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశాలు ఇచ్చారు. వారంలోగా కశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని, వచ్చేవారం నుంచి విద్యార్థులు నిర్భయంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పరిస్థితులు కల్పించాలని ఆయన నిర్దేశించారు.
కశ్మీర్‌లో నానాటికీ పరిస్థితులు దిగజారుతుండటం, ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత సమావేశం జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నిఘా, భద్రతా సంస్థల అధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో కశ్మీర్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
నిన్నమొన్నటివరకు అల్లర్లతో అట్టుడికిన కశ్మీర్.. బక్రీద్ నేపథ్యంలో వరుస ఉగ్రవాద దాడులతో ఉద్రిక్తంగా మారింది. అనంత్‌నాగ్ జిల్లాలోని నౌగామ్‌లో, పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు-భద్రతాదళాల మధ్య నాలుగు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు, ఓ పోలీసు అధికారి మృతిచెందారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని ఉద్రిక్తతను, హింసను ఇంకేంతమాత్రం ఉపేక్షించకుండా.. శాంతియుత పరిస్థితులు నెలకొనేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ భద్రతా దళాలకు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
రెచ్చగొట్టేవారిపై ఉక్కుపాదం మోపండి!
Published Mon, Sep 12 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
Advertisement
Advertisement