Kashmir situation
-
రెచ్చగొట్టేవారిపై ఉక్కుపాదం మోపండి!
న్యూఢిల్లీ: కశ్మీర్లో అల్లరిమూకను రెచ్చగొడుతూ.. హింసకు ప్రేరేపిస్తున్న తెరవెనుక సూత్రధారులపై ఉక్కుపాదం మోపాలని భద్రతా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశాలు ఇచ్చారు. వారంలోగా కశ్మీర్లో శాంతిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని, వచ్చేవారం నుంచి విద్యార్థులు నిర్భయంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పరిస్థితులు కల్పించాలని ఆయన నిర్దేశించారు. కశ్మీర్లో నానాటికీ పరిస్థితులు దిగజారుతుండటం, ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత సమావేశం జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నిఘా, భద్రతా సంస్థల అధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో కశ్మీర్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. నిన్నమొన్నటివరకు అల్లర్లతో అట్టుడికిన కశ్మీర్.. బక్రీద్ నేపథ్యంలో వరుస ఉగ్రవాద దాడులతో ఉద్రిక్తంగా మారింది. అనంత్‌నాగ్ జిల్లాలోని నౌగామ్‌లో, పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు-భద్రతాదళాల మధ్య నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు, ఓ పోలీసు అధికారి మృతిచెందారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని ఉద్రిక్తతను, హింసను ఇంకేంతమాత్రం ఉపేక్షించకుండా.. శాంతియుత పరిస్థితులు నెలకొనేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ భద్రతా దళాలకు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
కశ్మీర్ పరిస్థితిపై రాజ్ నాథ్ సమీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కశ్మీర్ లో గత కొంత కాలంగా నెలకొన్న పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ గంటకు పైగా చర్చించారు. మంత్రులకు అధికారలు కశ్మీర్ పరిస్థితులపై నివేదికను సమర్పించారు. గతేడాది నవంబర్ నెలలో కశ్మీరుకు కేటాయించిన రూ.80 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అమలుపై సమావేశంలో చర్చించారు. ముజాహిదీన్ కమాండర్, యువ వేర్పాటువాద నేత బుర్హాన్ వాని జులై 8న భద్రతాదళాల ఎన్కౌంటర్లో చనిపోయిననాటి నుంచి ప్రారంభమైన ఉద్రిక్తత 40 రోజులు దాటింది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 64 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. -
సోనియాతో ఫోన్లో మాట్లాడిన రాజ్‌నాథ్
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులపై సమీక్ష జరిపారు. అలాగే అమర్నాథ్ యాత్రికుల తరలింపుపై ఏర్పాట్లుకు ఆదేశాలు ఇచ్చారు. కాగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో రాజీ పడొద్దని, ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయాలని ఆమె సూచించారు. సామాన్య పౌరుల మరణాలు, భద్రతా బలగాలపై దాడులు బాధాకరమని ఆమె అన్నారు.