
మైదానంలో క్లీన్‌బోల్డ్.. పెళ్లికి క్రికెటర్ రెడీ!
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ జంట నూతన సంవత్సరం సందర్భంగా నిశ్చితార్థం చేసుకోబోతున్నదన్న కథనాలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పట్లో తమ ఎంగేజ్‌మెంట్ ఉండబోదంటూ విరాట్ సంకేతాలు ఇవ్వగా.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో అతని సహచరుడైన మరో క్రికెటర్ మాత్రం పెళ్లికి రెడీ అయ్యాడు.
కేరళ క్రికెటర్ సచిన్ బేబీ తన ప్రియురాలు అన్నాచాందీని వివాహమాడబోతున్నాడు. ఏడాదికాలంగా డేటింగ్ చేస్తున్న అన్నా చాందీని పెళ్లి చేసుకోబోతున్నట్టు గ్రాండ్‌గా ప్రకటించాడు. ఈ జంట వివాహ ఆహ్వాన వీడియోను కోకోనట్స్ వెడ్డింగ్స్ ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో కేరళ క్రికెట్ అసోసియేషన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సచిన్ టెండూల్కర్ అభిమానులకు మొదట కృతజ్ఞతలు చెప్పిన సచిన్ బేబి.. అనంతరం మైదానంలో అన్నా చాందీ వేసిన బంతికి బౌల్డ్ అవుతాడు. అనంతరం ఇద్దరు ఒకరిప్రేమను ఒకరు చాటుకుంటారు. ఈ నెల 5న తోడుపుఝాలోని చర్చిలో ఈ జంట వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నది.
2009లో కేరళ తరఫున క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్ బేబి ఇప్పటివరకు 47 మ్యాచుల్లో 2092 పరుగులు చేశాడు. 2015 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ జట్టులో చేరిన అతను ఇప్పటివరకు 11 టీ-20లలో 119 పరుగులు చేశాడు.