జెండా ఎగురవేసిన గంటకే..!
దేశభక్తుడైన ఆ సైనికాధికారి సోమవారం ఉదయం 8.29 గంటలకు మువ్వన్నెల జాతీయపతాకాన్ని ఎగురవేశాడు. ఆకాశంలో రెపరెపలాడుతున్న జెండాకు సెల్యూట్ చేసి.. జాతీయగీతాన్ని ఆలపించాడు. అనంతరం తన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశభక్తిని రగిలించే స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే తన కర్తవ్యదీక్షలో నిమగ్నమైన ఆయనను మృత్యువు వెంటాడింది. జాతీయజెండా ఎగురవేసిన గంటసేపటికే ఆయన జాతీయజెండాలో చుట్టబడిన అమరవీరుడిగా మారిపోయారు. ఆయనే సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రమోద్ కుమార్. స్వాతంత్ర్య దినోత్సవమైన సోమవారం శ్రీనగర్ లోని నౌహట్టా ప్రాంతంలో మిలిటెంట్లతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన ప్రాణాలు విడిచారు.
శ్రీనగర్ లోని కరన్ నగర్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో కమాండెంట్ ప్రమోద్ ఉదయం జెండా ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ సీఆర్పీఎఫ్ డీజీ సందేశాన్ని తన సైనిక బృందానికి వినిపించారు. దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. 'ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు కశ్మీర్ లో రాళ్లు విసురుతుండటాన్ని కూడా మనం ఎదుర్కొంటున్నాం. మనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తూ దేశ సమగ్రత, సమైక్యత, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను నిలబెట్టేందుకు కృషిచేద్దాం. ఎంతో మహత్తరమైన పోరాటం తర్వాత ఇవి మనకు లభించాయి' అని ఆయన పేర్కొన్నారు.
అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని నౌవాట్టా ప్రాంతంలో ఇద్దరు మిలిటెంట్లు కాల్పులకు దిగారని సమాచారం అందడంతో ఆయన వెంటనే సీఆర్పీఎఫ్ బృందంతో అక్కడికి చేరారు. మిలిటెంట్లతో జరిగిన ఎన్ కౌంటర్ కు ప్రమోద్ నాయకత్వం వహించారు. ఆయన గన్ నుంచి దూసుకుపోయిన తూటా ఓ మిలిటెంట్ ను హతమార్చింది. కానీ అంతలోనే ఓ మిలిటెంట్ తూటా వచ్చి ఆయన మెడకు దిగింది. కోమాలోకి వెళ్లిపోయిన ఆయనను వెంటనే శ్రీనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయిందని, మధ్యాహ్నానికి ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి భవేష్ చౌదరి తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో మరో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు ఓ కశ్మీర్ పోలీసు అధికారి కూడా గాయపడ్డారు. తలలో తూటా దిగిన పోలీసు అధికారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.