పోలీసులకు పట్టుబడ్డ నోట్ల సంచులు(పాత ఫొటో)
హైదరాబాద్: భారతదేశం మొత్తం కొత్త కరెన్సీ నోట్ల కోసం అల్లాడుతున్నవేళ.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రోడ్డుపై కరెన్సీ సంచుల వ్యవహారం కలకంలం రేపింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్- వరంగల్ హైవేపైనున్న మేడిపల్లి గ్రామానికి శనివారం మధ్యాహ్నం జనం తండోపతండాలుగా వచ్చారు. అక్కడి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీపీఆర్ఐ- కేంద్ర ప్రభుత్వ సంస్థ) వద్ద గుర్తుతెలియని వ్యక్తులు డబ్బు సంచులను వదిలేశారనే సమాచారంతో జనం అక్కడికి చేరుకుని, వెతుకులాట ప్రారంభించారు. భారీ జనసందోహం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.
సమాచారం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు సీపీఆర్ఐ వద్దకు చేరుకుని రోడ్లపైనున్న జనాన్ని చెదరగొట్టారు. కొద్ది నిమిషాల్లో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అసలా డబ్బు సంచుల వ్యవహారం ఒట్టి వదంతేనని పోలీసులు తేల్చారు. పుకార్లు నమ్మిన చాలా మంది డబ్బుల కోసం ఎగబడ్డారని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని మేడిపల్లి పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి పుకార్లు చెలరేగుతున్నాయి. వాటిలో కొన్ని చోట్ల నిజంగానే పాత లేదా నకిలీ నోట్ల కట్టలు బయటపడుతున్న సంగతి తెలిసిందే.